కేంద్ర మాజీ మంత్రి ఇళ్లలో సీబీఐ సోదాలు

కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్‌ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. చెన్నైలోని ఆమె ఇంటిలో ఉదయం నుంచి తనిఖీలు చేసింది. చెన్నైతో పాటు ఢిల్లీ, కోల్ కత్తా, రాంచీల్లో సోదాలు కొనసాగాయి. జయంతి నటరాజన్‌ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఆమెపై అధికార దుర్వినియోగం, కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జార్ఖండ్‌ లో ఐరన్‌ ఓర్‌ బ్లాక్స్‌ కు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన  సీబీఐ సోదాలు నిర్వహించింది.

ఇదిలా ఉంటే జయంతి పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే జార్ఖండ్‌ లో అటవీ ప్రాంతాన్ని అక్రమంగా మైనింగ్‌ కంపెనీలకు కట్టబెట్టారన్న ఆరోపణలపైనా సీబీఐ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఎన్విరాన్‌ మెంట్‌ మినిస్ట్రీతో పాటు జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌, జె.ఎస్.డబ్ల్యు స్టీల్‌ లిమిటెడ్‌ పై రెండు కేసులు, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ పై కేసు నమోదు చేసింది.