కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధం

సెంట్రల్‌ కేబినెట్‌ లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ప్రధాని మోదీ చైనా పర్యటనకు ముందే సెప్టెంబర్‌ 2 సాయంత్రం కేబినెట్‌ విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి రిజైన్‌ చేశారు.  చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కల్‌రాజ్‌ మిశ్రా, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రులు సంజీవ్‌ బలియాన్, మహేంద్ర పాండే కూడా ఇవాళ రాజీనామా సమర్పించే అవకాశం ఉంది.  కేంద్ర మంత్రి వర్గ పునర్‌ వ్యవస్తీకరణపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రధాని నరేంద్ర మోదీతో  పాటు మరో 8 మంది కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కేబినెట్‌ విస్తరణపై చర్చించిన తర్వాత ఇద్దరు మంత్రులు రాజీనామా లేఖలను ప్రధాని మోదీకి ఇచ్చారు.

మరోవైపు కేబినెట్‌ విస్తరణలో బీహార్‌కు చెందిన జేడీయూకు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. జేడీయూతో పాటు అన్నాడీఎంకే ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులివ్వన్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో రక్షణ, పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖ, పర్యావరణ శాఖలకు పూర్తి స్థాయి మంత్రులు లేరు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికవడం, అనిల్‌ దవే మరణం, మనోహర్‌ పరీకర్‌ గోవా సీఎంగా వెళ్లడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. పునర్వ్యవస్థీకరణలో భాగంగా విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు, వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ల శాఖల మార్పు జరగొచ్చు. అలాగే, బీజేపీ సీనియర్‌ నేత నితిన్‌ గడ్కారీకి రైల్వే శాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. నిర్మలా సీతారామన్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి