కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు

కేబినెట్ పునర్‌ వ్యవస్థీకరణపై అందరి అంచనాలను అందుకోలేకపోయారు ప్రధాని మోడీ. మంత్రి వర్గ విస్తరణలో బెర్త్ ఖాయమని, అనుకున్న చాలా మందికి హ్యాండిచ్చారు. ఎప్పటిలాగానే కొత్త వారికే ప్రాధాన్యమిచ్చారు ప్రధాని. కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన తొమ్మిది మందిలో నలుగురు బ్యూరోక్రాట్లు ఉన్నారు. మిగిలిన వాళ్లు స్థానికంగా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నవారున్నారు. ఇక శాఖల మార్పులు కేటాయింపుల్లో కూడా పెద్దగా సంచలన నిర్ణయాలేమీ తీసుకోలేదు ప్రధాని. నిర్మలా సీతారామన్ కు రక్షణ శాఖ, పియూష్‌ గోయెల్ కు రైల్వే శాఖ కేటాయింపు తప్ప…అద్భుతాలేమీ లేవు.

పాత మంత్రుల్లో నలుగురికి ప్రమోషన్ ఇచ్చిన ప్రధాని…ధర్మేంద్ర ప్రధాన్ కేబినెట్ హోదా ఇచ్చినప్పటికీ.. శాఖను మాత్రం మార్చలేదు. ముక్తార్ అబ్బాస్ కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నుంచి మైనార్టీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. ఇక పియూష్ గోయెల్ కు విద్యుత్ శాఖ నుంచి రైల్వే, బొగ్గు శాఖ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. నిర్మలా సీతారామన్ కు అనూహ్యంగా రక్షణ శాఖ కేటాయించారు.

పలువురు పాత మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేశారు ప్రధాని. స్మృతీ ఇరానీకి జౌళీ శాఖతో పాటూ అదనంగా సమాచార శాఖను కేటాయించారు. నితిన్ గడ్కరికి కూడా ప్రస్తుతం ఉన్నరవాణాశాఖతో పాటూ, గంగా ప్రక్షాళన, జలవనరుల అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక రైల్వే మంత్రిగా రిజైన్ చేసిన సురేష్ ప్రభుకు…ఇన్నాళ్లూ నిర్మలా సీతారామన్ నిర్వర్తించిన వాణజ్య, పరిశ్రమల శాఖ కేటాయించారు. మంత్రిపదవికి రాజీనామా చేశారని వార్తలు వచ్చిన ఉమాభారతికి…శాఖను మార్చారు. ఆమెకు తాగునీరు, పారిశుధ్య శాఖను కేటాయించారు. ఇక నరేంద్ర సింగ్ తోమర్ కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, గనుల శాఖ బాధ్యలు అప్పగించారు. అనిల్ దవే మరణంతో ఖాళీ అయిన పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖలను హర్షవర్ధన్ కు కేటాయించారు.

ఇక స్వతంత్ర హోదాలో పలువురు మంత్రులకు కూడా శాఖలు కేటాయింపులు, మార్పులు చేశారు. ఆర్ధిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న సంతోష్ కుమార్ గంగ్వార్ కు ఇంతకు మందు దత్తాత్రేయ నిర్వర్తించిన కార్మిక, ఉపాధి కల్పన శాఖను కేటాయించారు. గిరిరాజ్ సింగ్ కు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖను అప్పగించారు. గతంలో సమాచార శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ కు యువజన, క్రీడా, సమాచార ప్రసారాల శాఖలను కేటాయించారు.

ఇక నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో  అల్ఫోన్స్‌ కన్నన్‌ తానంకు స్వతంత్ర హోదాలో టూరిజం, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ, హర్‌దీప్‌సింగ్‌ పూరీకి స్వతంత్ర హోదాలో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ, రాజ్‌ కుమార్‌సింగ్‌ కు స్వతంత్ర హోదాలో విద్యుత్ శాఖ కేటాయించారు. గతంలో క్రీడా శాఖ నిర్వహించిన విజయ్ గోయెల్ కు  పార్లమెంట్ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన శివప్రతాప్‌ శుక్లాకు ఆర్థిక సహాయమంత్రిగా, అశ్వినీకుమార్‌ చౌబేకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సహాయ మంత్రిగా, అనంతకుమార్‌ హెగ్డేకు నైపుణ్యాభివృద్ధి సహాయ మంత్రిగా, గజేంద్రసింగ్‌ షెకావత్‌ కు వ్యవసాయ రైతు సంక్షేమ సహాయమంత్రిగా బాధ్యతలు అప్పజెప్పారు.