కెన్యా సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

గ‌త నెల‌లో కెన్యా దేశాధ్య‌క్షుడిగా ఉరు కెన్య‌ట్టా వ‌రుస‌గా రెండ‌వ సారి ఎన్నియ్యారు. అయితే ఆ ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును వెల్ల‌డించింది. రాజ్యాంగం ప్ర‌కారం ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌లేదు అని కోర్టు పేర్కొన్న‌ది. మ‌ళ్లీ కొత్త ఎన్నిక‌ల‌ను 60 రోజుల్లో నిర్వ‌హించాల‌ని కోర్టు ఆదేశించింది. ఆగ‌స్టు 12న జ‌రిగిన కెన్యా ఎన్నిక‌ల్లో ఉరు కెన్య‌ట్టా విజ‌యం సాధించారు. కెన్య‌ట్టా 54.3 శాతం ఓట్ల‌తో గెలిచారు.   ప్రత్యర్థి రైలా ఒడింగాకు 44.7 శాతం ఓట్లు ప‌డ్డాయి. 2013 నుంచి కెన్యా దేశాధ్య‌క్షుడిగా కెన్య‌ట్టా ఉన్నారు. ప‌దేళ్ల క్రితం జ‌రిగిన దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో తీవ్ర హింస జ‌రిగింది. అప్పుడు సుమారు 1100 మంది కెన్య‌న్లు చ‌నిపోయారు. అయితే ఇప్పుడు కూడా ఇలాంటి హింస జ‌రుగుతుందేమో అన్న భ‌యం వ్య‌క్తం అయ్యింది. కానీ ఎన్నిక‌లు దాదాపు స‌జావుగానే సాగాయి. అయితే ప్ర‌తిప‌క్ష నేత రైలా ఒడింగా మాత్రం తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. కోర్టు తీర్పు అనుకూలంగా రావ‌డంతో ఒడింగా కార్య‌క‌ర్త‌లు ఆనందోత్స‌హాల్లో తేలిపోయారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను హ్యాక్ చేశార‌ని, ఉరు కెన్య‌ట్టాకు అనుకూలంగా ఫ‌లితాల‌ను మార్చిన‌ట్లు ప్ర‌తిప‌క్ష ఒడింగా ఆరోపించారు.