కృష్ణా రివర్‌ బోర్డుకు తెలంగాణ సర్కార్‌ లేఖ  

కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో కనిష్ట నీటి సేకరణ స్థాయిని నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. గతేడాది రెండు రాష్ట్రాలు తమ అవసరాలకు గాను రెండు రిజర్వాయర్లలో ఎండీడీఎల్ కంటే దిగువకు వెళ్లి నీటిని వాడుకోవడంతో కొన్ని నెలలుగా హైదరాబాద్, నల్లగొండ తాగునీటి సరఫరాకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే ఈ ఏడాది ఎండీడీఎల్ దిగువకు వెళ్లకుండా సాధ్యమైనంతవరకు ప్రణాళికాబద్ధంగా వచ్చే ఏడాది వరకు నీటిని వాడుకోవాలని తెలంగాణ అభిప్రాయపడింది.

ఈ నీటి సంవత్సరంలో మొదటి మూడు నెల ఇన్‌ఫ్లోలు లేని దరిమిలా మే నెల వరకు ఉండే తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని పంపిణీ చేయాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది. వచ్చే ఏడాది జూలై వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 15.150 టీఎంసీలు, నల్లగొండ తాగునీటి అవసరాలకు 5.590 టీఎంసీలు కలిపి మొత్తంగా 20.140 టీఎంసీల నీళ్లు కావాలని ముందుగానే స్పష్టం చేసింది. ప్రస్తుతం శ్రీశైలంలో 884 కంటే ఎగువకు నీటిమట్టం వచ్చింది. కానీ నాగార్జునసాగర్లో మాత్రం నీటిమట్టం ఎండీడీఎల్ కంటే పది అడుగులు తక్కువగా ఉంది. అందుకే శ్రీశైలం నుంచి నీటిని సాగర్‌కు వదిలి రెండు జలాశయాల్లో కనిష్ట నీటి సేకరణ స్థాయి నిర్వహించాలని, తదుపరి వచ్చే నీటిని వాడుకునేందుకు గాను ఇండెంట్లు ఇచ్చుకుంటే బాగుంటుందనే అభిప్రాయానికి తెలంగాణ వచ్చింది. అటు అనంతపురం, కర్నూలుతో పాటు దిగువన కృష్ణా డెల్టా, ప్రకాశం, గుంటూరు తాగునీటి అవసరాలకు కూడా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఇది దోహదపడుతుందనేది తెలంగాణ నీటి పారుదల శాఖ అభిప్రాయం. ఇందుకు అనుగుణంగా బోర్డు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తుందనేది చూడాల్సి ఉంది.