కృష్ణా జలాల పంపిణీపై విచారణ ప్రారంభం 

తెలంగాణకు అన్యాయం చేయడానికి ఏపీ మరోమారు ప్రయత్నించింది. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌కు తెలంగాణ సమర్పించిన వివరణల్లో ఒక అంశాన్ని వక్రీకరించాలని చూసింది. అయితే తెలంగాణ దీనిని తిప్పికొట్టింది. తెలంగాణ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సవివరంగా ఈ అంశాన్ని వివరించడంతో ఆ ప్రతిపాదనను రీఫ్రేమ్ చేసేందుకు ట్రిబ్యునల్ అంగీకరించింది. మరో మూడు అంశాల్లోనూ తెలంగాణ కోరిన సవరణలకు ట్రిబ్యునల్ సమ్మతించింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్‌ ట్రిబ్యునల్ చేపట్టిన మూడురోజుల విచారణ ప్రారంభమైంది.

తెలంగాణ,ఏపీ దాఖలు చేసిన అంశాల్లో ట్రిబ్యునల్ విచారణకు ఎంపిక చేసిన వాటిపై తెలంగాణ తన అభిప్రాయాలను వినిపించింది. ఇందులో ప్రధానంగా ఏపీ ప్రతిపాదనల్లోని తొమ్మిదో అంశంపై వైద్యనాథన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్‌కు సమర్పించిన రీజాయిండర్‌ పేరా 3.5లో ఇతర బేసిన్లకు కృష్ణాజలాలు తరలిస్తున్న అంశంపై తెలంగాణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నీటి కేటాయింపుల్లో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇతర బేసిన్లలో మాత్రం కేవలం ఒక ఆరుతడి పంటను మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలని కోరింది. అయితే దీనిని ఏపీ పూర్తిగా వక్రీకరించింది. కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ ప్రాంతంలో ఒక ఆరుతడి పంటను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ కోరినట్లు  పేర్కొంది. ఆ మేరకు ట్రిబ్యునల్ ముందు ఒక ప్రతిపాదన ఉంచింది. ఇది గమనించిన వైద్యనాథన్ తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపారు. వాస్తవాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ అభ్యంతరాన్ని గుర్తించిన బ్రిజేశ్ …ఏపీ ప్రతిపాదనను పూర్తిగా రీఫ్రేమ్ చేసేందుకు అంగీకరించారు.

విచారణ కోసం ట్రిబ్యునల్ ఇప్పటికే తెలంగాణకు సంబంధించి 18, ఏపీకి సంబంధించి 13 ప్రతిపాదనలను ఎంపిక చేసింది. అయితే తాజాగా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ మరో ప్రతిపాదనను ఉంచింది. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్ తీర్పు అమలులోకి వస్తే కృష్ణా బేసిన్‌కు సంబంధించి కృష్ణాజల నిర్ణయ అమలుబోర్డు ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న కృష్ణానదీయజమాన్య బోర్డు కేడబ్యూడీఐబీ పరిధిలోకి వస్తుందా? అని తెలంగాణ ప్రశ్నించింది. ఈ విషయం తేల్చాలని కోరుతూ ప్రతిపాదన సమర్పించింది. ఏపీ ప్రతిపాదనల్లోని 2,3,4 అంశాల్లో పలు సవరణలు చేయాలని కోరింది. దీనికి బ్రిజేశ్ అంగీకరించారు.

అయితే కృష్ణా జలాల విషయంలో ఏపీ ద్వంద్వ వైఖరితో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాకు గండి కొట్టేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తోంది. బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు ఆ రాష్ట్రం సమర్పించిన అఫిడవిట్ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పవచ్చు. బచావత్ ట్రిబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. తర్వాత వచ్చిన బ్రిజేశ్‌ ట్రిబ్యునల్ ఆ కేటాయింపులను ముట్టుకోకుండా బేసిన్‌లో లభ్యత ఉన్న అదనపు జలాలను పంపిణీ చేసింది. ఉమ్మడిరాష్ట్రం ఉన్నప్పుడే నాటి సీమాంధ్ర పాలకలు దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. బ్రిజేశ్ తీర్పు అమలులోకి రాకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర విభజన తర్వాత మాట మార్చారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని ప్రస్తుత ఏపీ సర్కారు తన అఫిడవిట్‌లో గుర్తుచేస్తూ అదే స్థితిని కొనసాగించాలని కోరింది. తెలుగు గంగ, హంద్రీనివా, గాలేరునగరి సుజలస్రవంతి, వెలిగొండతోపాటు తెలంగాణకు చెందిన రెండు ప్రాజెక్టులకు తాము భవిష్యత్తులో ఎలాంటి నికరజలాల కేటాయింపులు అడగబోమని ఉమ్మడి ఏపీలో సమైక్య పాలకులు తెలిపారు. కానీ ఇప్పటి అఫిడవిట్‌లో మాత్రం ఏపీకి చెందిన  ఆ నాలుగు ప్రాజెక్టులపై తాము సుమారు రూ.26 వేల కోట్లు ఖర్చు పెట్టినందున వాటిని పరిరక్షించాలని కోరారు.