కాలుష్యరహిత వాహనాలపై దృష్టి పెట్టండి 

సంప్రదాయ ఇంధనంపై నడిచే వాహనాలకు కాలం చెల్లిందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి పెట్టకుంటే కాలుష్యానికి కారణమైన పాత వాహనాలను తొక్కి పెట్టేందుకు వెనుకాడబోమన్నారు.  ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ ప్రత్యేక నోట్‌ను సిద్ధం చేసిందని, త్వరలో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. “ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వాహన పరిధిలోకి మనం కదలాలి..దీనిపై తాను ఎవరినీ అడగబోను, కాలుష్యాన్ని, దిగుమతులను నియంత్రించేందుకు తన పనితాను చేసుకంటూ వెళుతాను” అని 45వ భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) ఏర్పాటు చేసిన వార్షిక సమావేశంలో మంత్రి వెల్లడించారు.  ప్రభుత్వానికి ఈ విషయంలో మద్దతిచ్చే వారు మేలు పొందుతారని, కేవలం సొమ్ము చేసుకోవడంలో తలమునకలయ్యేవారికి ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. పాత ఇంధనంతో రూపొందించిన వాహనాలు నిల్వవున్నాయని, తర్వాత తన వద్దకు ఎవరూ రావద్దని వాహన తయారీ సంస్థలకు ఆయన సూచించారు. ఇందుకు సంబంధించి కేంద్రం త్వరలో ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని ప్రవేశపెట్టనున్నదని ఆయన సంకేతాలిచ్చారు.  ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్యాక్సీలు, బైక్సు దిశగా భారత్ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. దిగుమతి, కాలుష్యం వంటి రెండు సమస్యలతో సతమతమవుతున్నదని, ప్రతియేటా దిగుమతి కోసం రూ.7 లక్షల కోట్ల మేర చెల్లించాల్సి వస్తుండటంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతుందన్నారు.