కాంగ్రెస్ పార్టీ మరో దుష్టపన్నాగం

కాంగ్రెస్ నేతలు తమ దుర్బుద్ధిని మరోసారి బయటపెట్టుకున్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి అంశానికి అడ్డం పడటమే ఏకైక కార్యక్రమంగా పెట్టుకున్న ఆ పార్టీ నేతలు తాజాగా బైసన్‌ పోలో గ్రౌండ్స్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకునే దుష్టపన్నాగాన్ని ప్రారంభించారు. ఏనాడూ తెలంగాణ పేరెత్తని, తెలంగాణ అభివృద్ధికోసం నోరెత్తని..రాష్ట్ర ప్రగతిపై ఏమాత్రం సోయిలేని కాంగ్రెస్ నేత వీ హన్మంతరావు ఈసారి రంగంలోకి దిగారు. కేంద్రంలో మొన్ననే రక్షణమంత్రిగా ప్రమాణం చేసి.. ఇంకా ఆ బాధ్యతలు కూడా తీసుకోని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కు ఆయన అప్పుడే లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వానికి రక్షణశాఖ ఆధీనంలోని భూములను అప్పగించవద్దన్నది ఆ లేఖ సారాంశం. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అక్కడి నేతలు రాష్ర్టానికి ఒక భూమి అదనంగా లభిస్తే సంతోషిస్తారు. అలా రావాలని కోరుకుంటారు. ఇక్కడ విచిత్రంగా కేంద్రం ఆధీనంలో ఉన్న భూమి వస్తుంటే ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు ఇవ్వవద్దని కేంద్రానికి లేఖలు రాస్తున్నారు.

వివిధ ప్రభుత్వ శాఖలు, కమిషనరేట్లు తదితర కార్యాలయాలన్నీ ఒకే ప్రాంగణంలో ఏర్పాటైతే ఫైళ్ల కదలికలో వేగం పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. ఈ దిశగా అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా సువిశాల స్థలంలో భారీగా సచివాలయ కార్యాలయాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాల్లో కూడా ఇదే విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో కూడిన కలెక్టరేట్ల సముదాయాలు నిర్మిస్తున్నది. పలుచోట్ల పనులు ప్రారంభమయ్యాయి. ఒక పాలనా విధానంగా తీసుకున్న ఈ నిర్ణయం మేరకు రాజధానిలో అందరికీ అందుబాటులో ఉండేలా, సకల సౌకర్యాలతో, ఆధునిక హంగులతో కొత్త సచివాలయ నిర్మాణాన్ని చేపట్టాలని భావించింది. కొత్త సచివాలయ నిర్మాణానికి అనువైన స్థలం కోసం నగరంలోని అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టిన అధికారులు, నిపుణుల కమిటీ సికింద్రాబాద్‌లోని బైసన్‌పోలో మైదానంలో కొత్త సచివాలయం నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని అంశాలను పరిశీలించి చివరకు అక్కడ కొత్త సచివాలయం నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. నిపుణుల కమిటీ సూచించిన బైసన్‌ పోలో గ్రౌండ్ స్థలం కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. సాక్షాత్తు ప్రధానమంత్రితో జరిపిన భేటీలో కూడా సీఎం కేసీఆర్ స్వయంగా ఈ స్థలం ఇవ్వాలని కోరారు.
ఎట్టకేలకు కేంద్రం కూడా స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సుముఖత వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందన్న విషయం తెలియగానే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వెర్రి అరుపులు మొదలుపెట్టారు. ఎలాగైనా నూతన సచివాలయ నిర్మాణం జరుగవద్దన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం ప్రారంభించారు. అప్పటి రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. అయితే జైట్లీ కాంగ్రెస్  మోసబుద్ధిని గ్రహించి స్పందించకపోవడంతో వారి పప్పులుడుకలేదు.

కేంద్రమంత్రికి లేఖ రాసిన వీహెచ్ తెలంగాణ ప్రభుత్వం మీద తన అక్కసును వెళ్లగక్కారు. బైసన్‌పోలో గ్రౌండ్స్‌లో సచివాలయం నిర్మిస్తే అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు మొదలవుతాయని లేఖలో చెప్పుకొచ్చారు. ఇక జింఖానా మైదానంలో ఆటల కోసం వచ్చే క్రీడాకారులకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న నివాసాలతో నిత్యం ట్రాఫిక్ జాం అవుతున్నదని, అందువల్ల కొత్తగా ఇక్కడ సచివాలయం నిర్మించకుండా అడ్డుకోవాలని కోరారు. ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న సచివాలయం ఏదో ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రమే చెందుతుంది..రాష్ట్ర ప్రజలను రానివ్వరన్నంతగా కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.

వాస్తవానికి సీఎం కేసీఆర్ దూరదృష్టితో సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే రహదారి అభివృద్ధికి, ప్యారడైజ్ నుంచి కరీంనగర్, రామగుండం వరకు ఉన్న రాజీవ్ రహదారికి వెళ్లే మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. కరీంనగర్, నిజామాబాద్ రహదార్లపై ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణంతో ట్రాఫిక్ చిక్కులు తొలిగించాలని నిర్ణయించారు. రక్షణ శాఖ ఆధీనంలోని భూములు రాష్ట్రప్రభుత్వానికి కేటాయిస్తే ఈ రహదారుల అభివృద్ధి ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ఇక బైసన్‌పోలోకు జింఖానా మైదానానికి తేడా తెలియకుండా కాంగ్రెస్‌నేతలు గాయి పెడుతున్నారు. జింఖానా మైదానం లేకుంటే క్రీడాకారులకు నష్టమని మాట్లాడుతున్న వీహెచ్, గతంలో తాను మంత్రిగా ఉండి క్రీడాకారులకు అందునా తెలంగాణ క్రీడాకారులకు ఏమైనా చేశారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జింఖానా మైదానానికి సంబంధించిన లీజు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నది. జింఖానాకు ట్రాఫిక్‌ కు ముడిపెట్టడంతోనే ఆ పార్టీ నాయకులకున్న అవగాహన ఏపాటిదో అర్థమవుతున్నదని ప్రజలు నవ్వుతున్నారు.

తెలంగాణ సర్కారు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ఓర్వలేక అడ్డుకోవడమే ఎజెండాగా పెట్టుకుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నీటిపారుదల శాఖ ప్రాజెక్టులు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, విద్యుత్ సంస్థల్లోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అబ్సార్‌ప్షన్, సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వంటి వాటిని అడ్డుకున్న ఘనులు తాజాగా సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకునే కార్యక్రమం ఎత్తుకునట్టు కనిపిస్తున్నది.. దేశ రక్షణ మంత్రిగా ఇంకా బాధ్యతలు కూడా తీసుకోని నిర్మలా సీతారామన్‌కు తొలి ఉత్తరం కాంగ్రెస్ నేత వీ హన్మంతరావుది కావటం.. అదికూడా రాష్ర్టాభివృద్ధి గురించి కాకుండా రాష్ర్టానికి రక్షణ భూమి ఇవ్వరాదనే విజ్ఞాపన కావడం కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.