కమల్‌ హాసన్‌ను కలిసిన నగ్మా

ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ను మాజీ నటీ, నేటి కాంగ్రెస్‌ నేత నగ్మా కలిశారు. ఆళ్వార్‌పేటలోని కమల్‌ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. గంటపాటు వీరి సమావేశం కొనసాగింది. రాజకీయ విషయాల గురించి ఇద్దరూ చర్చించారు. వీరి చర్చల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తావన కూడా వచ్చినట్లు సమాచారం.

కొద్ది రోజులుగా తమిళనాడు ప్రభుత్వంపై కమల్‌హాసన్‌ ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రుల అవినీతి కుంభకోణాలను బయట పెట్టాలంటూ ప్రజలు, అభిమానులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఆయన నిప్పులు చెరుగుతున్నారు. సామాజిక మాధ్యమాలు, మీడియా సమావేశాల్లోనే కాకుండా.. తాను హోస్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ కార్యక్రమంలో కూడా రాజకీయ విషయాలను ప్రస్తావిస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.  కాషాయం తన గుర్తు కాదని వెళ్లడించారు. ఈ నేపథ్యంలో నగ్మా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.