ఐఫోన్‌-X వచ్చేసింది!

ఆపిల్ ఐఫోన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా మూడు ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. వాటిలో ఒకటి ఐఫోన్ ఎక్స్ కాగా మిగిలినవి ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్. వీటిని ఆపిల్‌ సీఇవో టిమ్‌ కుక్‌ విడుదల చేశారు. ఐఫోన్‌ కొత్త మోడల్‌ ఫోన్లతో పాటు ఆపిల్ వాచ్ సిరీస్‌ 3, 4కె సపోర్ట్ ఉన్న ఆపిల్ టీవీ తదితర కొత్త ఉత్పత్తులను కూడా విడుదల చేసింది.

ఐఫోన్ తొలిసారిగా విడుద‌లై 10 వ‌సంతాలు పూర్త‌యినందుకు గుర్తుగా నూతన ఐఫోన్‌కు ఐఫోన్ ఎక్స్ అని పేరు పెట్టారు. దీని ధర భారత కరెన్సీలో 64 వేలు ఉంటుందని అంచనా. 2016 సెప్టెంబర్‌ లో ఐఫోన్‌ సెవెన్‌, ఐఫోన్‌ సెవెన్‌ ప్లస్‌ లను విడుదల చేసిన ఆపిల్‌ సంస్థ.. సరిగ్గా ఏడాది తర్వాత సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్స్‌ మార్కెట్‌ లోకి తీసుకువచ్చింది.

ఐఫోన్‌ ఎక్స్‌ ను సరికొత్త ఫీచర్లతో తీసుకువచ్చారు. బెజెల్ లెస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లేను సూప‌ర్ అమోలెడ్ టైప్‌లో అందించారు.  అదేవిధంగా ఐఫోన్ 8 ప్ల‌స్ మోడ‌ల్ వెనుక భాగంలో రెండు కెమెరాల‌ను ప‌క్క ప‌క్క‌నే కాకుండా ఒక దాని కింద ఒక‌టి ఏర్పాటు చేశారు. వైర్ లెస్ చార్జింగ్‌, గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌, వాట‌ర్‌- డ‌స్ట్ రెసిస్టెన్స్‌, యూజ‌ర్ ముఖంతో ఫోన్‌ను అన్‌లాక్ చేసే ఫేస్ ఐడీ త‌దిత‌ర ఫీచ‌ర్లు సరికొత్త ఐఫోన్ వెర్షన్‌ లో ఉన్నాయి.

ఐఫోన్‌ ఎక్స్‌ మోడల్‌.. స్పేస్‌ గ్రే, సిల్వర్‌ కలర్‌లో లభిస్తాయి. 458 హైఎస్ట్‌ ఫిక్సెస్‌ డెన్సిటీని కలిగి ఉంది. సూపర్‌ రెటీనా డిస్‌ ప్లేగా పిలుస్తారు. డయగ్నల్లీ 5.8 ఇంచెస్‌, రిసొల్యూషన్‌ 2436 ఇంటూ 1125గా ఉంటుంది. OLED డిస్‌ ప్లేను మొదటిసారి ఉపయోగించారు.  ట్రూ టోన్‌ డిస్‌ ప్లే టెక్నాలజీ ఇందులో ఉంది. 4కె వీడియా రికార్డింగ్‌ సౌకర్యం కల్పించారు.

గత పదేళ్లుగా ఆవిష్కరణల పైన ఆవిష్కరణలతో ఆపిల్‌ సంస్థ ముందుకు దూసుకుపోతోందని ఐఫోన్‌ కొత్త మోడల్స్‌ విడుదల సందర్భంగా ఆ సంస్థ సిఇవో టిమ్‌ కుక్‌ పేర్కొన్నారు. కొత్త కొత్త  ఆవిష్కరణలను ఆవిష్కరించే మరో సమయం వచ్చింది. గతంలో ఎపుడూ లేని విధంగా కొత్తగా సృష్టించిన ఈ డివైజ్‌..  మరింత తెలివైన, చాలా సామర్థ్యమున్న, చాలా సృజనాత్మకమైనదని తెలిపారు.

ఆపిల్ సంస్థ సంప్రదాయం ప్రకారం కొత్తఫోన్లు విడుదల చేసిన కొన్నాళ్లకు గానీ అందుబాటులోకి రావు. అక్టోబర్‌ 27 నుంచి ముందస్తు ఆర్డర్లు ప్రారంభమవుతాయి.. నవంబర్‌ 3 తర్వాత అంతర్జాతీయంగా స్టోర్లలోకి రానున్నాయి. ఇక ఈ ఫోన్ భారత మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందనే విషయంపై క్లారిటీ లేదు.