ఏటీఎంలలోకి 200 నోట్లు ఇప్పుడే రావట!

ఆర్బీఐ గతవారం రూ.200 నోట్ల‌ను విడుద‌ల చేసినా.. అవి ఏటీఎంల‌లో రావాలంటే మ‌రో మూడు నెల‌ల స‌మ‌యం పట్ట‌నుంది. దేశ‌వ్యాప్తంగా ఏటీఎం మెషిన్ల‌ను రీకాలిబ‌రేట్ చేయాల్సి ఉంటుంది. మ‌రోవైపు ఇప్ప‌టికీ చాలా వ‌ర‌కు బ్యాంక్‌ల‌కు ఇంకా కొత్త 200 నోట్లు రాలేదు. గ‌తేడాదే నోట్ల ర‌ద్దు, ఆ త‌ర్వాత కొత్తగా 2000, 500 నోట్లు రావ‌డంతో బ్యాంకులు భారీ ఎత్తున ఏటీఎంల రీకాలిబ‌రేష‌న్ చేశాయి. ఇప్పుడు మ‌రోసారి ఈ నోటు కోసం మెషిన్లలో మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. త్వ‌ర‌లోనే 200 నోట్ల పంపిణీ మెరుగ‌వుతుంద‌ని ఆర్బీఐ చెప్పినా, స‌రిప‌డా నోట్లు ఎప్పుడొస్తాయ‌ని మాత్రం చెప్ప‌లేదు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు మెషిన్ల‌ను రీకాలిబ‌రేట్ చేయాల్సిందిగా ఆర్బీఐ త‌మ‌కు చెప్ప‌లేద‌ని ఏటీఎం త‌యారీ సంస్థ‌లు చెబుతున్నాయి. కొన్ని బ్యాంకులు మాత్రం అన‌ధికారికంగా టెస్ట్ చేయాల‌ని మాత్రం సూచించిన‌ట్లు చెప్పాయి. దేశ‌వ్యాప్తంగా ఉన్న మొత్తం 2.25 ల‌క్ష‌ల ఏటీఎంల‌నూ రీకాలిబ‌రేట్ చేస్తారా లేదా అన్న‌ది కూడా తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఏటీఎంల వినియోగానికి ఎలాంటి ఇబ్బంది త‌లెత్త‌కుండా మొత్తం రీకాలిబ‌రేష‌న్ ప్ర‌క్రియ ముగియ‌డానికి 90 రోజులు ప‌డుతుంద‌ని నిపుణుల అంచనా.