ఎయిర్ హోస్టెస్‌గా శ్రియ!

ప్రస్తుత పోటీ తరుణంలో కథానాయికల కెరీర్ ఐదారేళ్లకు మించి కొనసాగడం అరుదనే చెప్పాలి. కానీ సినీ జీవితాన్ని మొదలుపెట్టి పదిహేడేళ్లు గడుస్తున్నా శ్రియ జోరు కొనసాగుతూనే ఉన్నది. గ్లామర్‌తో పాటు అభినయ ప్రధాన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ సొగసరి మరో ఛాలెంజింగ్ పాత్రలో కనిపించబోతున్నది. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్‌బాబు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వీరభోగవసంతరాయలు. ఈ చిత్రంలో ఎయిర్ హోస్టెస్‌గా శ్రియ పాత్ర ట్రెండీ లుక్‌తో నవ్యపంథాలో సాగుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మహిళల శక్తిసామర్థ్యాలను చాటిచెప్పే ఎయిర్‌హోస్టెస్‌గా స్ఫూర్తివంతంగా ఆమె పాత్ర ఉంటుందని తెలిసింది. గ్లామర్‌కు దూరంగా పూర్తిగా నటనకు ప్రాధాన్యమున్న ఛాలెంజింగ్ పాత్ర ఇదని సమాచారం. శ్రియ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. ఇంద్రసేన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శ్రియ హిందీలో తడ్క చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.