ఎయిర్ ఫోర్స్ మార్షల్ అర్జన్ సింగ్ కన్నుమూత

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ అర్జన్ సింగ్ (98) కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో ఆయన్ని చేర్చారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని ఇవాళ సాయంత్రమే ప్రధానమంత్రి నరేంద్ర మోడి, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శించారు.

అర్జన్ సింగ్ మృతికి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం తెలిపారు. అర్జన్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతితో ఎయిర్ ఫోర్స్ లో ఒక శకం ముగిసిందన్నారు మోడీ. అర్జన్ సింగ్ సేవలను దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు.

అర్జన్ సింగ్ 19 ఏళ్లకే 1938లో ఎయిర్ ఫోర్స్ లో చేరారు. 1965 పాకిస్థాన్ యుద్ధంలో వీరోచిత పాత్ర పోషించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫైవ్ స్టార్ ర్యాంక్ సాధించిన ఏకైక అధికారి ఆయనే కావడం విశేషం. 1985లో పద్మ విభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది. 1989-91 మధ్య ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు. 2016లో పనాగఢ్ ఎయిర్ బేస్ కు అర్జన్ సింగ్ పేరు పెట్టారు.