ఉపాధ్యాయులకు గవర్నర్ శుభాకాంక్షలు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర ఎంతో ఉన్నదని గవర్నర్ తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప ఉపాధ్యాయుడని, దేశ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకుసాగుతూ దేశ నిర్మాణం, ప్రగతిలో టీచర్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు మంచి దిశ చూపుతూ మార్గదర్శకులు కావాలని ఆయన ఆకాంక్షించారు.  భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

అటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో విద్యారంగం పటిష్ఠమవుతున్నదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గాడితప్పిన విద్యావ్యవస్థను దారిలో పెట్టేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. కేజీ టు పీజీ విద్యను అందించడంతోపాటు 525 గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు.