ఉద్యమంలా రైతు సమన్వయ సమితుల ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా రైతు సమన్వయ సమితులకు అవగాహన సదస్సులు జోరుగా సాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు.. తమతమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రైతు కమిటీలకు అవగాహన కల్పిస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో జరిగిన రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సులో.. మంత్రులు పోచారం, తుమ్మల పాల్గొన్నారు. రైతుల అభివృద్ధికి కృషి చేసేలా రైతు సమితులతో ప్రమాణస్వీకారం చేయించారు.

మెదక్‌ జిల్లా హవేలిఘన్‌ పూర్‌ లో జరిగిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో మంత్రులు హరీశ్‌ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అన్నదాతల కష్టాలు తీర్చేందుకే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. అసంఘటితంగా ఉన్న అన్నదాతలను సంఘటితం చేసేందుకే… రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సులో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే బాబూమోహన్‌ పాల్గొన్నారు. ఆందోల్, పుల్కల్, టేక్మల్ మండలాల నుంచి భారీ సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి రోజూ ఐదు జిల్లాలు పర్యటిస్తున్నానని, సెప్టెంబరు 14 కల్లా గ్రామ, మండల స్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు పూర్తి చేయాలని మంత్రి పోచారం చెప్పారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో జరిగిన రైతు సమన్వయ సమితి సమావేశంలో మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పాల్గొన్నారు. శంషాబాద్ మండల స్థాయి రైతు సమన్వయ సమితితో పాటు, గ్రామ స్థాయి రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది రైతులకు సమన్వయ సమితులు సేవలందిస్తాయని మంత్రి పోచారం తెలిపారు.

నిర్మల్ లోని పాలశీతలీకరణ కేంద్రంలో పాలమిత్ర, పాడిరైతులకు అవగాహన, శిక్షణ తరగతులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత సోన్ మండల కేంద్రంలో జరిగిన రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై పలు సలహాలు సూచనలు చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి… సమితి సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు.  ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పాడిరైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రం లో రైతు సమన్వయ సమితి సదస్సులో మంత్రి జూపల్లి  పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌, ప్రజాప్రతినిధులు హాజరయ్యారరు. రైతు సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పాలన సాగుతుందని మంత్రి జూపల్లి తెలిపారు.నల్గొండ జిల్లా చండూరు, మునుగోడు మండలాలకు చెందిన రైతు సమితులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ సదస్సుల్లో పాల్గొన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి ఈ అద్భుత కార్యక్రమం పుట్టిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇల్లందులో నిర్వహించిన రైతు సమితుల అవగాహన సదస్సులో స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం మండలాలకు చెందిన రైతు సమన్వయ సమితి సభ్యులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌ పాల్గొని, కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతు సమితుల సభ్యులు  పెద్ద ఎత్తున పాల్గొన్నారు.నిర్మల్ జిల్లా కడం, దస్తూరాబాద్ మండలాల్లో నిర్వహించిన రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సుల్లో ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్ పాల్గొన్నారు. రైతులకు సంపూర్ణ భరోసా ఇచ్చేందుకే సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పారు.

మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేటలో గ్రామ స్థాయి, మండల స్థాయి రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సు జరిగింది. ఇందులో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులతోపాటు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.పెద్దపల్లి ఆర్యవైశ్యభవనంలో జరిగిన రైతు సమన్వయ కమిటీ సభ్యుల శిక్షణ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హాజరయ్యారు. అన్నదాతల బాగుకు పాటుపడాలంటూ రైతుల చేత ప్రమాణస్వీకారం చేయించారు.

సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో రైతు సమన్వయ సమితుల ఏర్పాటు కోసం స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలో జరిగిన రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా భారీ సంఖ్యలో రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు సమన్వయ సమితిల ఏర్పాటుపై అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్న రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సుల్లో  ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రైతులను సంఘటిత శక్తి మార్చడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నదాతలు ప్రశంసిస్తున్నారు.