ఇర్మా దెబ్బకు ఫ్లోరిడా, జార్జియా ఖాళీ

ఇర్మా దెబ్బకు  ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాలు దాదాపు ఖాళీ అవుతున్నాయి. ఫ్లోరిడా తీర ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 63 లక్షల మంది.. ఇళ్లు వాకిళ్లు ఖాళీ చేసి, దూర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని అధికారులు సూచించారు. అలాగే, జార్జియా రాష్ట్రంలోని తీర ప్రాంతం నుంచి కూడా ఆరు లక్షల మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. అంటే, 70 లక్షలకుపైగా ప్రజలు ఫ్లోరిడా, జార్జియాలను వదిలిపెట్టి వెళ్లిపోయారు. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద వలసల్లో ఒకటిగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఫ్లోరిడాకు 728 కిలోమీటర్ల దూరంలో ఉన్న అట్లాంటా రాష్ట్రంలోని హోటళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఫ్లోరిడాలో తూర్పు నుంచి పశ్చిమ తీరం వరకూ పట్టణాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. వలస వెళుతున్న ఫ్లోరిడా వాసుల వాహనాలతో రహదారులు కిక్కిరిశాయి.