ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యోగ నియామకాలు.!

ప్రముఖ దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ తాజాగా ఉద్యోగా నియామకాలపై దృష్టి పెట్టింది. ఇటీవల కాలంలో ఈ ఐటీ దిగ్గజ సంస్థ పలు ఇబ్బందులను ఎదుర్కొంటుంది.  మరీ ముఖ్యంగా విశాల్‌ సిక్కా రాజీనామా, శేషసాయి లేఖ తదితర వివాదాలు కార్పొరేట్‌ రంగంలో చర్చకు ఊతమిచ్చాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ వచ్చే రెండేండ్లలో ఏటా 6000 మందికిపైగా ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు కంపెనీ పేర్కొంది. అలాగే అమెరికా, ఐరోపా మార్కెట్లలోనూ ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయనున్నట్టుగా తెలిపింది. ‘నియామక ప్రక్రియను యథాతథంగా కొనసాగిస్తాం. ఈ ఏడాది 6000 మందికి ఉపాధి కల్పించనున్నాం. వచ్చే రెండేండ్లలో ఇదే విధంగా నియామకాలు ఉంటాయి. అయితే అవి కంపెనీ వృద్ధిపై ఆధారపడి ఉంటుందని సంస్థ తాత్కాలిక సీఈవో, ఎండీ యూబీ ప్రవీణ్‌రావు తెలిపారు. ఏటా పది లక్షల మంది గ్రాడ్యుయేట్‌లు విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వస్తున్నారని, వీరిలో కేవలం 20-30శాతం మంది మాత్రమే ప్రతిభ కలిగిన వారు ఉంటున్నారన్నారు. అలాంటి వారి కోసం తమతో పాటు, ఇతర కంపెనీలు పోటీపడతాయని తెలిపారు. జూన్‌ 2017 నాటికి ఇన్ఫోసిస్‌లో మొత్తం 1,98,553మంది ఉద్యోగులు ఉన్నారు.