ఇక శరవేగంగా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం

యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంటు ఐదో దశ నిర్మాణానికి అవసరమైన రూ.4,009 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అంగీకరించింది. దీంతో 4వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి ప్లాంటు నిర్మాణానికి అవసరమైన నిధులు నూటికి నూరు శాతం సమకూరినట్లయింది. ఐదో యూనిట్ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందించడానికి అంగీకరిస్తూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సిఎండి రాజీవ్ శర్మ విద్యుత్ సౌధలో ఇవాళ జెన్ కో సిఎండి డి.ప్రభాకర్ రావుకు లేఖను అందించారు.

ఒక్కొక్కటి 800 మెగావాట్ల చొప్పున ఐదు యూనిట్లు నెలకొల్పి 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా దామరచెర్లలో సూపర్ క్రిటిక్ టెక్నాలజీతో యాదాద్రి పవర్ ప్లాంటును నెలకొల్పుతున్నారు. ఇందులో మొదటి నాలుగు యూనిట్ల నిర్మాణానికి అవసరమైన రూ.16,950 కోట్ల ఆర్థిక సాయం అందించడానికి ఆర్.ఇ.సి. ఇప్పటికే అంగీకరించింది. ఐదో యూనిట్ కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. తాజా రుణంతో తెలంగాణ విద్యుత్ సంస్థలైన జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కమ్ లలో  పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అందిస్తున్న ఆర్థిక సాయం రూ.28,210 కోట్లకు చేరింది. ఇప్పటికే ఈ నాలుగు సంస్థలకు పి.ఎఫ్.సి. 16,156 కోట్ల రూపాయల చెల్లింపులు కూడా జరిపింది.

యాదాద్రి పవర్ ప్లాంటులోని ఐదో యూనిట్ కు ఆర్థిక సాయం లభించడం పట్ల జెన్ కో చైర్మన్ ప్రభాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. పీఎఫ్సీ సిఎండి రాజీవ్ శర్మకు కృతజ్ఞతలు తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులకు, 24 గంటల వ్యవసాయ విద్యుత్ కు, ఇతర భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తిని పెంచడంలో యాదాద్రి ప్లాంటుది అత్యంత కీలక పాత్ర అని చెప్పారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ప్లాంటుకు ఇటీవలే పర్యావరణ అనుమతులతో పాటు అన్ని రకాల అనుమతులు వచ్చాయని, ఇప్పుడు నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా నూటికి నూరుశాతం సమకూరాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన ప్రకారం యాదాద్రి ప్లాంటు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.