ఇక చీర్ గాళ్సీ చిందులు ఉండవు!

ఐపీఎల్ అంటే అభిమానులకు వెంటనే గుర్తుకు వచ్చేది చీర్‌గాళ్స్. ఉషారెత్తించే పాటలకు వారు చేసే డ్యాన్స్‌లు. గత పదేండ్లుగా ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇవి పరిచయమే. కొత్త జట్లు వస్తూ పోతున్నా.. అభిమానులకు మాస్ మసాలా లాంటి విందును అందించింది చీర్‌గాళ్స్ చిందులే. దీనికి తోడు మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు సంప్రదాయ దుస్తులు ధరించి మ్యాచ్‌లను విశ్లేషించే వైనం అభిమానుల మదిలో అలా నాటుకుపోయాయి. అయితే ఇవన్నీ రానున్న ఐపీఎల్ మ్యాచుల్లో మనకు కనిపించకపోవచ్చు. అవును.. తాజాగా ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ ఇండియా తమ ప్రాధాన్యాలు ఏంటో స్పష్టంగా తెలిపింది. గతానికి భిన్నంగా పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి సారిస్తూ ప్రసారాలు చేస్తామని స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్ అన్నారు. రూ. 500 కోట్ల తేడాతో ఐపీఎల్ హక్కులు దక్కించుకున్నామంటే పోటీ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన తెలిపారు.