ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్స్ తో పరిశ్రమలకు భరోసా

చిన్న, మధ్యతరహా పరిశ్రమల పట్ల బ్యాంకులు ఏకపక్షంగా వ్యవహరించకుండా, మూతపడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

స్మాల్, మీడియం పరిశ్రమలకు చేయూతను ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  గవర్నర్ ను కలిసిన ఏకైక మంత్రిని తానేనని అనుకుంటానని మంత్రి కేటీఆర్ అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూత ఇస్తే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. పాలసీలను తీసుకురావడంలో, పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ ఏడాదిలోనే 372 సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు.

పెట్టుబడులను ఆకర్షించడంలో, పరిశ్రమల ఏర్పాటులో దేశంలోనే తెలంగాణ దూసుకుపోతోందని అసోచాం ఇటీవల చేసిన సర్వేలో తేలిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ప్రపంచంతో పోటీ పడాలని సీఎం కేసీఆర్ చెబుతుంటారని, ఆయన సూచించినట్టే ముందుకు పోతున్నామని చెప్పారు.
రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకులు ఇస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మొదటి సంవత్సరం 13వ ర్యాంక్ వస్తే చాలా బాధపడ్డామని, ఆ తర్వాత సంవత్సరం మొదటి ర్యాంక్ కి రావడంతో చాలా సంతోష పడ్డామని అన్నారు. ఈసారి కూడా మొదటి స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. చాలా ఫాస్టెస్ట్ గ్రోత్ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమంత్రి సురేష్ ప్రభు అధికారులు అందరి ముందే స్వయంగా అన్నారని కేటీఆర్ గుర్తుచేశారు.

రాష్ట్రంలోని వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలే బ్రాండ్ అంబాసిడర్లు అని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో వ్యాపారం చెయ్యాలా వద్దా, పర్మిషన్ ఎలా ఇస్తున్నారు అనేది ప్రపంచానికి తెలియజేసేది వ్యాపారులు మాత్రమేనని, కనుక మీకు అన్ని విధాలా తోడ్పాటు ఇస్తేనే ఇలా ముందుకు వెళ్తామని మంత్రి అభిప్రాయపడ్డారు.

సరళతరమైన వ్యాపారం చెయ్యడం ఒక్కటే మార్గం కాదని, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా తగ్గించవచ్చు అనే విషయంలో తమకు సలహాలు, సూచనలు చెయ్యవచ్చని పారిశ్రామిక, వ్యాపారవేత్తలను ఉద్దేశించి మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ఉండే ప్రాముఖ్యత, ఇక్కడ ఉండే వాతావరణం వల్ల సంస్థలు నెలకొల్పవచ్చన్నారు.

ఈ సమావేశంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, అధికారులు, పెద్దసంఖ్యలో పారిశ్రామిక, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.