ఇంటింటికీ త్రాగు నీరు అందిచడమే లక్ష్యం

రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ నల్లాల ద్వారా మంచినీరందించే మిషన్‌ భగీరథపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం సజావుగా అమలయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే మిషన్ భగీరథకు నీటి సరఫరాపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ లో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్‌ ఎస్.పి. సింగ్, నీటిపారుదల శాఖ, మిషన్‌ భగీరథ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రజలకు నిరంతరాయంగా మంచినీరందించేందుకే మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఒకసారి నీరివ్వడం ప్రారంభిస్తే… ఆ తర్వాత ఒక్కరోజు కూడా సరఫరా ఆపలేమని చెప్పారు. అందువల్ల నదీ జలాలు ఏడాది పొడవునా అందుబాటులో ఉండాలని… ప్రాజెక్టుల్లో కనీస నీటి వినియోగ మట్టాలను నిర్వహించాలని సూచించారు. ప్రాజెక్టుల్లో నీటిని అవసరమైనప్పుడు విడుదల చేసుకునేందుకు వీలుగా నిల్వలు ఉంచుకోవాలన్నారు. అప్పుడు మాత్రమే మంచినీటి కొరత లేకుండా చూడగల్గుతామని చెప్పారు.

అటు, మిషన్ భగీరథ కోసం 30 పాయింట్లను రిసోర్సులుగా పెట్టుకున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఏ రిసోర్స్ దగ్గర ఏడాదికి ఎంత మొత్తంలో నీరు అవసరమో అంచనా వేయాలని… దానికి 25 శాతం అదనంగా వనరులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రాజెక్టుల వారీగా చార్ట్ లు రూపొందించి… ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. తదనుగుణంగానే ఆపరేషనల్  రూల్స్  రూపొందించాన్నారు. దీనికోసం నీటిపారుదల, మిషన్ భగీరథ అధికారులు సంయుక్త సమావేశం నిర్వహించుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. అందులో 10 శాతం వాటర్‌ ను మంచినీటి కోసం రిజర్వు చేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులు పూర్తయితే చాలా నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ఎస్.ఆర్.ఎస్.పి, నాగార్జునసాగర్ వంటి సోర్సులున్నాయని చెప్పారు. కొత్త ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించేందుకు… ప్రస్తుతం ఉన్న సోర్సులనే ఉపయోగించుకోవాలని సూచించారు. ఇందుకోసం మొదటి దశ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత శాశ్వత ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఈ ఏడాది చివరికే నదీ జలాలను గ్రామాలకు అందించాలని సూచించారు. అందుకోసం మొదటి దశ ప్రణాళికను అమలు చేయాలన్నారు. నీటి పారుదల శాఖతో సమన్వయం కోసం మిషన్ భగీరథ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు.

అడవుల పునరుద్ధరణలో భాగంగా వికారాబాద్ ఫారెస్ట్ లో ఎంపిక చేసిన ఔషధ మొక్కలు పెంచాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. మూడో విడత హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. నిజాం కాలంలో వికారాబాద్ ప్రాంతంలో సహజమైన ఔషధ మొక్కలతో కూడిన అడవి ఉండేదని గుర్తు చేశారు. అందుకే అక్కడ టీబీ హాస్పిటల్ ఏర్పాటు చేశారన్నారు. ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే వికారాబాద్ ప్రాంతాన్ని మరో ఊటిగా తీర్చిదిద్దే అవకాశాలున్నాయని చెప్పారు. అటు, మూడో విడత హరితహారంలో భాగంగా 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి 29 కోట్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మరో 10 కోట్ల మొక్కలు కూడా ఈ నెలాఖరులోగా నాటాలని ముఖ్యమంత్రి వారిని ఆదేశించారు. ఓఆర్ఆర్ చుట్టూ మొక్కల పెంపకం విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా సంచార పశు వైద్యశాలలను సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. త్వరలోనే వాటిని ప్రారంభించనున్నట్టు చెప్పారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున వచ్చిన గొర్రెలతో పాటు, ఇతర పశువులకు వైద్యం అందించేందుకు సంచార పశు వైద్యశాలలు ఉపయోగపడతాయన్నారు.

బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని పేదలందరికీ చీరలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ కోరారు. ఇప్పటికే సగానికిపైగా చీరలు జిల్లా కేంద్రాలకు చేరాయని అధికారులు తెలిపారు. మిగతావి రెండు మూడు రోజుల్లో సరఫరా చేస్తామని చెప్పారు. జిల్లాలకు పంపిణీ అయిన చీరలను గ్రామాలకు చేర్చాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు వాటిని పంపిణీ చేయాలని ఆదేశించారు.