ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై చైనా ఆగ్రహం

టు-ఫ్రంట్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై చైనా మండిపడింది. బ్రిక్స్ సదస్సులో మోడీ-జిన్‌పింగ్ భేటీ సందర్భంగా చర్చించిన దానికి విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆ దేశ విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బిపిన్ రావత్ మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీ టు-ఫ్రంట్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. చైనా యుద్ధానికి కాలుదువ్వుతోందని, మరోవైపు పాకిస్థాన్‌తో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్న రావత్.. రెండు వైపులా యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని కోరారు. జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యలను చైనా విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది. రెండు రోజుల క్రితమే జరిగిన ఇరు దేశాధి నేతల భేటీలో అన్ని విషయాలు చర్చకు వచ్చాయని, కలిసికట్టుగా ముందుకు సాగాలని, వివాదాలను పక్కనపెట్టి అభివృద్ధి కోసం పాటుపడాలని నిర్ణయించుకున్నారని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ తెలిపారు. ఇటువంటి సమయంలో భారత ఆర్మీ చీఫ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ విషయాలను ఆయన (బిపిన్ రావత్) దృష్టిలో పెట్టుకుంటారని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు.