చిన్నతరహా పరిశ్రమలకు మద్దతు ఇవ్వండి

ఒకరోజు ముంబై పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల సమస్యలపైన వాటి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైనా సవివరమైన లేఖను అందజేశారు. దాదాపు గంట సేపు జరిగిన ఈ సమావేశంలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ఆర్బీఐ నుంచి కావాల్సిన మద్దతు పైన మంత్రి వివరించారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో చిన్నతరహా పరిశ్రమల పారిశ్రామికోత్పత్తి 45 శాతం ఉందని, మొత్తం 40 శాతం ఎగుమతులు చిన్నతరహా పరిశ్రమల నుంచే వస్తున్నాయని మంత్రి వివరించారు. చిన్నతరహా పరిశ్రమలతో లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని, ఇలాంటి రంగానికి కేంద్ర బ్యాంకు సహకారం అవసరమని తెలిపారు.

అయితే, ప్రస్తుతం దేశంలో ఉన్న బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఆశించిన మేర చిన్నతరహా పరిశ్రమలకు సహకారం లభించడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. చాలా సందర్భాల్లో ఇవి చిన్న తరహా పరిశ్రమలను సిక్ పరిశ్రమలుగా గుర్తించి వేలం వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నతరహా పరిశ్రమలను ఎన్పీఎలుగా గుర్తించడంలో ఆర్బీఐ ఇచ్చిన టెక్నో వయబిలిటీ స్టడీ, కనీస 17 నెలల గడువు వంటి మార్గదర్శకాలను చాలా సందర్భాల్లో ఉల్లంఘిస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఆర్బీఐ గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని ఒక ప్రభుత్వ బ్యాంకు అక్కడి చిన్న తరహా పరిశ్రమను ఎన్పీఎగా గుర్తించిన 15 రోజుల్లోనే వేలం వేసిన విషయాన్ని మంత్రి కేటీఆర్  ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిన్నతరహా పరిశ్రమల బకాయిల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ మార్గదర్శకాలను చాలా బ్యాంకులు పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విధంగా స్టేట్ లెవల్ ఇంటర్ ఇనిస్టిట్యూషనల్ కమిటీ పునర్వవ్యవస్ధీకరణ చేయాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 69,120 గుర్తింపు పొందిన సూక్ష్మ మరియు చిన్నతరహా పరిశ్రమలున్నాయని, ఇందులో సుమారు 8,618 సిక్ యూనిట్లుగా గుర్తించబడ్డాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సమస్యను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరిట ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టిందని, ఇందుకోసం సుమారు వంద కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసిందని చెప్పారు. తెలిపారు. ఈ హెల్త్ క్లినిక్ ల ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వంలోని వివిధ శాఖల తాలూకు సహకారంతో పాటు, వివిధ ఆర్థిక సంస్థల నుంచి అందవలసిన అర్ధిక సహకారం అందించే దిశగా పనిచేస్తుందని తెలిపారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ను ప్రత్యేక ఆర్ధిక సంస్ధ (ఎన్బీఎఫ్సీ) గా గుర్తించేందుకు అవసరమైన సహాయ, సహకారాలను ఆర్బీఐ అందించాలని మంత్రి కేటీఆర్ ఆర్బీఐ గవర్నర్ ను కోరారు.

ఈ సందర్భంగా ఉర్జిత్ ప‌టేల్‌ కు చేనేత శాలువ‌ను మంత్రి కేటీఆర్ బ‌హూక‌రించారు.