ఆర్టీఏ కార్యాలయంలో ప్రిన్స్ సందడి 

మొన్న‌టి వ‌ర‌కు స్పైడ‌ర్ షూటింగ్‌తో బిజీగా ఉన్న మ‌హేష్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అను నేను చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే త‌న కారు రిజిస్ట్రేష‌న్ చేసుకునే ప‌నిలో భాగంగా మ‌హేష్ కొద్ది సేప‌టి క్రితం ఖైరతాబాదులోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. స్వ‌యంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన మ‌హేష్ వేలిముద్ర తీసుకొని అధికారులు వాహ‌నం రిజిస్ట్రేష‌న్ చేశారు. మహేశ్ కొనుగోలు చేసిన రూ. కోటీ 50 లక్షలు విలువ చేసే టయోటా ల్యాండ్‌ క్రూజర్‌కు టీఎస్‌ 09 ఈవీ 4005 నెంబరును ఆర్టీఏ అధికారులు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రిన్స్ రాక‌తో ఆ ప్రాంగ‌ణం అంతా సంద‌డి నెల‌కొంది. మ‌హేష్ వచ్చాడ‌న్న విష‌యం తెలుసుకొని అభిమానులు ఆర్టీఏ కార్యాల‌యానికి భారీగా చేరుకున్నారు. ఇక కొంద‌రు ఆర్టీఏ ఉద్యోగులు మ‌హేష్‌తో ఫోటోలు దిగారు.