ఆధార్‌పై అపనమ్మకాన్ని తొలగించాలి

ఆధార్ డాటా వినియోగం, దాని పరిరక్షణపై ప్రజల్లో నెలకొన్న అపనమ్మకాన్ని ప్రభుత్వం తొలగించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ సూచించారు. ప్రస్తుత ప్రపంచంలో టెలికాలర్స్‌కు ప్రతి ఒక్క విషయం తెలుస్తుందని, ముఖ్యంగా ప్రజలు ఏమి కొనుగోలు చేస్తారో..వారికి ఏమి అవసరమో తెలుసునని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ప్రజల మధ్య నెలకొన్న అపనమ్మకంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక వృద్ధిలో దేశ ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పించేందుకుగాను ఆధార్‌ను ముందుకు తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతున్నదని, దీనిపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. ఆధార్, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్ల అనుసంధానం చేయడానికి కేంద్రం ఇటీవల జామ్ పేరుతో ప్రత్యేక వసతి కల్పించింది. వివిధ పథకాలకు కూడా ఆధార్‌ను కచ్చితంగా జతచేయాలనడంపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో రాజీవ్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి 70 శాతం మందికి బ్యాంక్ ఖాతా లేదని, ఇందుకోసం ఆధార్ సాంకేతికను అందిపుచ్చుకోవడం ద్వారా డిజిటల్ లావాదేవీలు. సమ్మిళిత వృద్ధి సాధన భారత్ ముందున్న కర్తవ్యాలని ఆయన తెలిపారు.