అసమాన ధైర్య సాహసి అస్తమయం

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మార్షల్‌ అర్జన్‌ సింగ్‌.. గొప్ప దార్శనికుడు.. ప్రణాళికా చాతుర్యమున్న వ్యక్తి.. కదనరంగంలో కదలాడుతుంటే.. శత్రువు ఎంతటి బలవంతుడైనా.. కరిగి తీరాల్సిందే. ముందు చూపుతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తు చేసే అసమాన ధైర్య సాహసి.. మన అర్జన్‌ సింగ్‌. 1965 భారత్‌-పాక్‌ యుద్ధంలో అర్జన్‌ వీరోచితంగా పోరాడారు. యువ వైమానిక దళానికి నాయకత్వం వహించి.. పాక్‌ వైమానిక దళాన్ని చిత్తుచేశారు. అమెరికా యుద్ధ విమానాలతో పోరాడుతున్న పాక్‌ను తన అసమాన ధైర్య సాహసాలతో తుత్తునీయులు చేసి.. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. తుది శ్వాస విడవడంతో.. భారతజాతి కంట కన్నీరొలుకుతోంది.

దేశవ్యాప్తంగా ఐఏఎఫ్‌ అధికారుల్లో అత్యున్నత స్థాయి అయిన ఫైవ్‌ స్టార్‌ ర్యాంకు పొందిన ఏకైక ఎయిర్‌ మార్షల్‌ అర్జన్‌ సింగ్‌. శత్రుదేశాలతో యుద్ధాలు, పలు ఆపరేషన్లలో సింగ్‌ కీలకపాత్ర పోషించారు. ప్రత్యేకించి నాటి బ్రిటిషర్ల హయాంలో రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌తో జరిగిన యుద్ధంలోనూ ఐఏఎఫ్‌ అధికారిగా విశేష దైర్య సహసాలు ప్రదర్శించారు. అప్పట్లో పాక్‌ పన్నిన గ్రాండ్‌ స్లామ్‌ అక్నూర్‌ ఆపరేషన్‌ను తన కౌంటర్‌ ఆపరేషన్‌తో విచ్ఛిన్నం చేశారు. అమెరికా దన్నుతో అధునాతన ఆయుద సంపత్తితో పాక్‌ యుద్ధానికి దిగినా.. ఐఏఎఫ్‌ అధికారిగా వైరి దేశం వ్యూహాలను చిత్తు చేశారాయన. 60కి పైగా విభిన్న తరహా విమానాలను నడిపి చరిత్ర సృష్టించారు. ఐఏఎఫ్‌ను ప్రపంచంలోనే నాలుగో అత్యున్నతమైన ఎయిర్‌ఫోర్స్‌ గా తీర్చిదిద్దడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

అర్జన్‌ సింగ్‌ 1919 ఏప్రిల్‌ 15న అవిభాజ్య భారత్‌లోని పంజాబ్‌ ల్యాల్‌పూర్‌ లో జన్మించారు. 19 ఏళ్ల ప్రాయంలోనే పైలెట్‌ కోర్సుకు ఎంపికయ్యారు. 1941లో ఐఏఎఫ్‌లో ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా ఎంపికై, 1944లో స్క్వాడ్రన్‌ లీడర్‌గా పదోన్నతి పొందారు. ఐఏఎఫ్‌లో చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ గా 45 ఏళ్లకే ఎంపికయ్యారు. 1970లో ఉద్యోగ విరమణ చేసి.. మరుసటి ఏడాదే స్విట్జర్లాండ్‌లో భారత రాయబారిగా నియమితులయ్యారు. అనంతరం 1974లో కెన్యాలో భారత రాయబారిగా పని చేశారు. 1980లలో చోటు చేసుకున్న పంజాబ్‌ అల్లర్లను చల్లబరచడంలో కేంద్రం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ద్వారా కీలక పాత్ర పోషించారు. 1989లో జనతా పార్టీ ప్రభుత్వం ఆయనను ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించింది. 1965లో ఆయనను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది. 2002లో ఫీల్డ్‌ మార్షల్‌ సమాన స్థాయి అయిన ఫైవ్‌స్టార్‌ హోదాను ఇచ్చి గౌరవించారు.

అర్జన్‌ సింగ్‌ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వరల్డ్‌ వార్‌-2, పాకిస్థాన్‌తో యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన గొప్ప యుద్ధ వీరుడు అర్జన్‌ సింగ్‌ అని కోవింద్‌ అన్నారు. అర్జన్‌ సింగ్‌ చేసిన సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ప్రధాని మోడీ చెప్పారు. అంతకుముందు అర్జన్‌ సింగ్‌ను మోదీ ఆస్పత్రిలో పరామర్శించారు. తనను చూడగానే లేవలేని స్థితిలోనూ ఆయన శాల్యూట్‌ చేసేందుకు ప్రయత్నించారని, గొప్ప సైనికుడిగా ఆయన నిబద్ధతకు ఇదే నిదర్శమని ట్విట్టర్‌లో నివాళులర్పించారు.