అమెరికాలో ప్రళయం సృష్టిస్తున్న ఇర్మా తుఫాన్

కరీబియన్‌ దీవుల్లో అల్లకల్లోలం సృష్టించిన హారికేన్‌ ఇర్మా అమెరికాను వణికిస్తోంది.    ఫ్లోరిడా కీస్ వద్ద తీరాన్ని తాకిన ఇర్మా.. ప్రచండ గాలులు, కుంభవృష్టి వర్షాలతో బీభత్సం సృష్టిస్తున్నది.  ఫ్లోరిడాకు ఆగ్నేయ దిశన 30 నుంచి 65 కిలోమీటర్ల వ్యాసంతో వలయాకారంగా తుఫాన్‌ కేంద్రీకరించి ఉందని, ఇది వాయువ్య దిశగా కదులుతున్నదని మియామీలోని నేషనల్ హరికేన్ సెంటర్  వెల్లడించింది. ఇర్మా ప్రభావంతో ఫ్లోరిడాలో జనజీవనం స్తంభించింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 4 లక్షల మంది చీకట్లో మగ్గుతున్నారు.

ఇర్మా విలయం కారణంగా ఫ్లోరిడాలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇర్మా ధాటికి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 29కి చేరింది. 112 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇర్మా కారణంగా గంటకు 185 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.   10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావొచ్చని.. 10 నుంచి 15 అడుగుల ఎత్తు వరకు వరద నీరు చేరవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వీలైనంత త్వరగా ఖాళీ చేయాల్సిందిగా ఫ్లోరిడా గవర్నర్‌ రిక్‌ స్కాట్‌ ప్రజలకు సూచించారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను రక్షించేందుకు యూఎస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. దాదాపు 7400 మంది అమెరికా సైనికులు రంగంలోకి దిగారు. ప్రజలను కాపాడేందుకు 140 విమానాలు, 650 ట్రక్కులు, 150 బోట్లను సిద్ధంగా ఉంచినట్లు పెంటగాన్‌ ప్రకటించింది. 1992లో వచ్చిన హారికేన్‌ ఆండ్రూ తర్వాత మళ్లీ ఫ్లోరిడాను ఆ స్థాయిలో ముంచెత్తుతున్న హరికేన్‌ ఇర్మానే అని అక్యూ వెదర్‌ అధ్యక్షుడు జోయెల్‌ మేయర్స్‌ వెల్లడించారు. దీని వల్ల ఫ్లోరిడాలో భారీగా నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఫోరిడా కీస్‌, కీ లార్గో, టంపా, ఫోర్ట్‌ మేయర్స్‌, నేపుల్స్‌, సరపోట, మియామి ప్రాంతాలపై ఇర్మా ప్రభావం ఎక్కువగా ఉంది.

ఫ్లోరిడాలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న దాదాపు 63 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జార్జియా నుంచి మరో ఆరు లక్షల మందిని తరలించారు. మియామి, టంపా, ప్రాంతాల్లో ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఫ్లోరిడాలో   260 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. యుద్ధ ప్రాతిపదికన మరో 70 షెల్టర్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. జార్జియా రాష్ట్రంలోని అతిపెద్ద నగరం అట్లాంటా హోటళ్లన్నీ ఫ్లోరిడా వాసులతో నిండిపోయాయి. జార్జియా తీర ప్రాంతాల నుంచి 5.4లక్షల మంది సహాయక శిబిరాలకు వెళ్లాలని అధికారులు కోరారు. ఫ్లోరిడా, జార్జియాతో పాటు ఉత్తర కరోలినా, అలబామా రాష్ట్రాల్లోనూ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

ఫ్లోరిడాలోని లక్షా 20వేల మంది భారతీయ అమెరికన్లతో పాటు మియామిలోని వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇర్మా ప్రభావంతో వెయ్యికి పైగా తెలుగు కుటుంబాలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. భారతీయ అమెరికన్లను రక్షించేందుకు భారత దౌత్య కార్యాలయం 24 గంటల హెల్ప్‌ లైన్‌ సదుపాయాన్ని కల్పించింది. ప్రజలను రక్షించేందుకు మరిన్ని శిబిరాలను ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితిని అమెరికాలో భారత రాయబారి నవతేజ్‌ సర్ణా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పలు భారతీయ సంస్థలు ఇండియన్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ అట్లాంటా, గుజరాతీ సమాజ్‌, హిందూ టెంపుల్‌ ఆఫ్‌ అట్లాంటా మూడు పునరావాస కేంద్రాల్ని నిర్వహిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లోని భారతీయ అమెరికన్లు తోటి భారతీయుల కోసం సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. చాలా మంది ఇండ్లలోనే బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.

హరికేన్‌ ఇర్మా ముంచుకొస్తున్నదని.. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పిలుపు ఇచ్చారు. భార్య మెలానియాతో కలిసి వారాంతపు విహార యాత్ర కోసం మేరీలాండ్‌ చేరుకున్న ట్రంప్‌   అక్కడే క్యాబినెట్‌ సమావేశాన్ని నిర్వహించారు. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత విధ్వంసకర తుఫాన్‌ కావచ్చని ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు.