అమెరికాను హడలెత్తిస్తున్న ఇర్మా తుఫాన్

అమెరికాను వరుస తుఫాన్లు హడలెత్తిస్తున్నాయి. ఓ వైపు హర్వీ హరికేన్‌ బీభత్సం నుంచి తేరుకోకముందే దాన్ని మించిన తుపాన్‌ ఇర్మా రూపంలో భయపెడుతోంది. ఇప్పటికే కరేబియన్‌ దీవుల్లో తీవ్ర నష్టం కలిగించిన ఇర్మా హరికేన్‌…ఫ్లోరిడా వైపు దూసుకొస్తోంది. ఆదివారం ఉదయం ఫ్లోరిడా వద్ద ఈ హరికేన్‌ తీరం దాటనుంది. ఈ సమయంలో 25 అడుగుల మేర అలలు ఎగిసిపడతాయని…250 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావారణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం అత్యంత విధ్వంసరకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో అమెరికా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 10లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎంతటి ప్రమాదమైనా ఎదుర్కొనే విధంగా అమెరికా అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే హార్వీ హరికేన్ కారణంగా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. ఇర్మా తుఫాన్‌పై ఆందోళన చెందుతుండగానే…అగ్రరాజ్యం వైపే మరో తుఫాన్‌ దూసుకొస్తోంది. జోస్‌ అనే పిలిచే ఈ హరికేన్‌ ఇర్మా బాటలో భారీ విధ్వంసం సృష్టిస్తుందని చెబుతున్నారు. కరేబియన్‌ దీవుల్లో ఇర్మా హరికేన్ కారణంగా 17 మంది మరణించారు. 60 శాతం దీవులు దెబ్బతిన్నాయి. ఇర్మా ప్రభావంతో దాదాపు రెండున్నర కోట్ల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.