అన్నాడీఎంకేలో ముగిసిన శశికళ శకం

అక్రమాస్తుల కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు మరో షాక్‌ తగిలింది. అన్నాడీఎంకే నుంచి ఆమెను బహిష్కరిస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శశికళ సహా ఆమె మేనల్లుడు దినకరన్‌ ను కూడా పార్టీ నుంచి తొలగించారు. ప్రస్తుతం పార్టీ తాత్కాలిక ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్‌ పనిచేస్తున్నారు. పళని, పన్నీర్‌ వర్గం విలీనం సమయంలోనే వీరద్దరిని పార్టీ నుంచి బహిష్కరించాలని పన్నీర్ వర్గం కోరింది. అందుకు ఓకే చెప్పిన పళనిస్వామి వర్గం సమయం చూసుకొనే శశికళ కుటుంబానికి చెక్ పెట్టింది. అన్నాడీఎంకే తాజా నిర్ణయంతో దశాబ్దాలుగా శశికళ కుటుంబానికి అన్నాడీఎంకే ఉన్న అనుబంధం ముగిసినట్లైంది.

అటు తాత్కాలిక ఉప కార్యదర్శిగా దినకరన్ చేపట్టిన నియామకాలను రద్దు చేస్తూ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. అంతేకాదు, జయలలిత పార్టీ పదవుల్లో నియమించిన వారే…. ఇక నుంచి ఆయా పదవుల్లో కొనసాగాలని నిర్ణయించారు. రెండాకుల గుర్తు తమకే చెందుతుందని కూడా మరో తీర్మానం చేశారు. ఇక పార్టీ బాధ్యతలను నిర్వహించేందుకు మార్గదర్శక కమిటీని నియమించారు. పార్టీ చీఫ్ కో ఆర్డినేటర్ గా పన్నీర్ సెల్వం, అసిస్టెంట్ చీఫ్ కో ఆర్డినేటర్ గా పళని స్వామిని నియమించారు. పార్టీ  ప్రధాన కార్యదర్శికి ఉండే అన్ని అధికారాలు వీరికి ఉంటాయని పార్టీ నియమావళిలో మార్పులు చేశారు. ఇక అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి పదవి దివంగత జయలలిత పేరిటే కొనసాగుతుందని అన్నాడీఎంకే నేతలు చెప్పారు.

అన్నాడీఎంకే నిర్ణయంపై దినకరన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం చెల్లదని చెప్పారు. జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించే అర్హత వారికి లేదన్నారు. జనరల్‌ కౌన్సిల్ మెంబర్స్ లేకుండా జనరల్ కౌన్సిల్‌ మీట్ ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పళనిస్వామి ప్రభుత్వాన్ని కొనసాగనివ్వనని ఆయన శపథం చేశారు. అమ్మ ఆశయాలను వమ్ము చేసిన పళనిస్వామికి సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు దినకరన్.

ఐతే, అన్నాడీఎంకే ఇక పూర్తిగా తమదేనని పళనిస్వామి, పన్నీర్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ రెండాకుల గుర్తు తమదేనని, ఎలక్షన్‌ కమిషన్‌ కూడా తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు, దినకరన్ తన వర్గం ఎమ్మెల్యేలను ఉంచిన కర్నాటకలోని కొడగులో ఉన్న పడ్డింగ్టన్ రిసార్టుని తమిళనాడు పోలీసులు చుట్టుముట్టారు.