అటవి భూముల పరిరక్షణకు చర్యలు

రాష్ట్రంలో ఉన్నట్టు ఉన్న అటవీ భూముల పరిరక్షణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా అటవీ భూముల లెక్కలకు కూడా ఒక స్పష్టతనివ్వాలని భావిస్తున్నది. రాష్ట్రంలో 26 లక్షల హెక్టార్లకు పైగా అటవీ భూములున్నాయి. అందులో 10 శాతం అంటే.. సుమారు రెండు లక్షల హెక్టార్లు కబ్జాలకు గురయ్యాయి. మరో లక్ష ఎకరాలు వివాదాల్లో ఉన్నట్టు అంచనా. రాష్ట్రంలో మొత్తం అడవులు, అభయారణ్యాలు, జాతీయ పార్కులకు సంబంధించిన అటవీ, రెవెన్యూశాఖల లెక్కల్లో తేడాలున్నాయి. రాష్ట్రంలోని భూముల లెక్కలన్నీ పక్కాగా ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం సంబంధిత రెవెన్యూ రికార్డులన్నీ ప్రక్షాళన చేసే బృహత్ కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలోనే అటవీ భూముల లెక్కలపైనా దృష్టి సారించింది.

ఉమ్మడిరాష్ట్రంలో అడవుల విధ్వంసకాండ యథేచ్ఛగా కొనసాగింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని, పలుకుబడిని వినియోగించుకుని బలవంతులు సాగుభూములతోపాటు, అటవీ భూములను కూడా ఆక్రమించుకున్నారు. వేలు, లక్షల ఎకరాల్లో భూములు అన్యాక్రాంతమయ్యాయి.దాంతో పూర్వకాలంలో దట్టంగా ఉండే అడవులు పలుచబడ్డాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం అడవుల శాతం పెంచడాన్ని ఒక ముఖ్యమైన అంశంగా తీసుకుని ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఊళ్లలో మొక్కలునాటడంతోపాటు.. అడవుల పునరుద్ధరణకు అటవీ ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా భూములతోపాటే అటవీ భూముల లెక్కలు తేల్చాలని సర్కారు నిర్ణయించింది. రికార్డుల ప్రక్షాళనలో భాగంగా మొదట వివాదాల్లో లేని భూముల లెక్కలపై దృష్టి సారిస్తున్నట్టు అధికారులు తెలిపారు. చాలాకాలం క్రితమే లక్షల ఎకరాల రెవెన్యూ భూములను అభయారణ్యాలుగా నోటిఫై చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 28,080 చదరపు కిలోమీటర్ల పరిధిలో అడవులు విస్తరించి ఉన్నాయి. అందులో సుమారు 5,600 కిలోమీటర్ల పరిధిలో అభయారణ్యాలు, జాతీయ పార్కులున్నా అటవీశాఖ, రెవెన్యూశాఖల్లో వీటికి సంబంధించిన లెక్కల్లో చాలా వ్యత్యాసం ఉంది. కొన్ని ప్రాంతాలలో అటవీ భూములు రెవెన్యూరికార్డులలో పట్టాభూములుగా, ప్రభుత్వ, పోరంబోకు భూములుగా నమోదై ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూముల బదలాయింపు జరిగినా రికార్డులను మార్చలేదు. అసలు రికార్డులను సవరించాలన్న ఆలోచనే సమైక్యపాలకులకు రాలేదు. వాటి సరిహద్దులను గుర్తించేందుకు కూడా ఏనాడు గత ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోలేదు. ఈ పరిస్థితిని కబ్జాదారులు అనుకూలంగా మలుచుకున్నారు. అందినకాడికి కాజేశారు. అటవీ భూములు కబ్జా అవుతున్నా అటు అటవీశాఖ కానీ, ఇటు రెవెన్యూ శాఖలు కానీ తమకేమీ పట్టనట్లు వ్యవహరించాయి. ఈ పరిస్థితి ఇంకా ఉందన్న ఆరోపణలున్నాయి. దశాబ్దాల నుంచి కొనసాగుతున్న ఈ విధ్వంసకాండకు ఇకనైనా ఫుల్‌స్టాప్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే 10 ఎకరాల కంటే ఎక్కువగా అటవీ భూములను ఆక్రమించిన కబ్జాదారుల జాబితాను సిద్ధం చేసింది. ఆ భూములను వాపస్ తీసుకోవడంపై దృష్టి సారించింది.

ఈ కార్యక్రమం అంతా సజావుగా కొనసాగితే తెలంగాణలో అడవుల శాతం పెరిగి మళ్లీ రాష్ట్రమంతా పచ్చగా కళకళలాడడం ఖాయం.