అక్రమంగా నీటి తరలింపునకు ఏపీ కుట్ర

కొంతకాలంగా తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య శ్రీశైలం నీటి వివాదం నడుస్తోంది. హైదరాబాద్, నల్లగొండ జిల్లాల తాగునీటి అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేయాలని బోర్డుకు లేఖ రాసింది. దీనికి ఏపీ సర్కార్ అంగీకరించలేదు. అంతేకాకుండా… బోర్డు అనుమతి లేకుండా ముచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా నీటిని లిఫ్ట్ చేసి తరలించింది. తెలంగాణ మాత్రం తమకు అవకాశమున్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటార్లతో 1600 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేసి ఉపయోగించుకుంటోంది. కల్వకుర్తి ప్రాజెక్టు లిఫ్టుల ద్వారా గరిష్టంగా 2 నుంచి 3 వేల క్యూసెక్కుల కంటే ఎక్కువ ఉపయోగించలేరు. ఈ విషయంపై ఇరు రాష్ట్రాలు బోర్డుకు ఫిర్యాదులు చేసుకోవడంతో.. బోర్డు రిజర్వాయర్‌ నీటి మట్టాలపై టెలిమెట్రీ నిఘా పెట్టింది.

ప్రస్తుతం శ్రీశైలంకు ఎగువనుంచి ఇన్‌ఫ్లోలు భారీగా వస్తుండటంతో… జలాశయాం నీటి మట్టం 840 అడుగులు దాటింది. నీటిని ఇరు రాష్ట్రాలు వచ్చే ఏడాది జూన్-జూలై వరకు వాడుకునే విధంగా బోర్డు చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టు నీటిపై పూర్తి స్థాయి నిఘా పెట్టింది కృష్ణా బోర్డు. టెలిమెట్రీ ఏర్పాటు చేసిన దరిమిలా.. శ్రీశైలం జలాశయం నీటిమట్టాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పరిశీలిస్తోంది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది కూడా పోతిరెడ్డిపాడు ద్వారా 53 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయింది ఏపీ.

గత ఏడాది అనుభవాల దృష్ట్యా తెలంగాణ కూడా పోతిరెడ్డిపాడు నీటి తరలింపుపై అప్రమత్తమైంది. పోతిరెడ్డి పాడు నుంచి ఏపీ నీటి తరలింపులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.