99 శాతం నోట్లు తిరిగొచ్చాయి

పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని లక్షల కోట్ల నల్లధనం, నకిలీ నోట్లు బయటికి వస్తాయని భావించిన మోడీ సర్కారుకు నిరాశే మిగిలింది. డిమానిటైజేషన్‌ (1000, 500 రూపాయల నోట్ల రద్దు) తర్వాత డిపాజిట్ అయిన నోట్ల లెక్క తేలింది. ఎట్టకేలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ వివరాలను వెల్లడించింది. రద్దు చేసిన పెద్ద నోట్లలో దాదాపు 99 శాతం డిపాజిట్‌ అయ్యాయని తెలిపింది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తీసుకున్న అతిపెద్ద ఆర్థిక నిర్ణయాల్లో పెద్దనోట్ల రద్దు ఒకటి. గతేడాది నవంబర్‌ 8న ప్రధాని మోడీ వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. బ్లాక్‌ మనీ, నకిలీ నోట్లు భారీగా చలామణిలో ఉన్నాయని, ఒక్క దెబ్బతో ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రక్షాళన అవుతుందని చెప్పారు. ఐతే నోట్ల రద్దు తర్వాత ఎంత మనీ రిటర్న్‌ వచ్చింది. బ్లాక్ మనీ ఎంత, నకిలీ మనీ ఎంత అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లకు ఈ వివరాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది.

ఆర్బీఐ వార్షిక రిపోర్ట్‌ లో భాగంగా డిమానిటైజేషన్‌ లెక్కలను ప్రకటించింది. దేశం మొత్తంలో 15 లక్షల 44 వేల కోట్ల రూపాయల విలువ చేసే వెయ్యి, ఐదు వందల నోట్లను రద్దుచేయగా… వాటిలో దాదాపు 99 శాతం డబ్బు రిజర్వ్ బ్యాంక్ కు చేరింది. అంటే 15 లక్షల 28 వేల కోట్లు బ్యాంకులలో డిపాజిట్ అయినట్లు ఆర్బీఐ తెలిపింది. 2016 మార్చి వరకు చలామణిలో ఉన్న 632 కోట్ల 60 లక్షల కోట్ల వెయ్యి రూపాయల నోట్లలో… ఇంకా 8.9 కోట్ల వెయ్యి రూపాయల నోట్లు రిజర్వ్‌ బ్యాంకుకు చేరలేదు. అంటే కేవలం 1.3 శాతం వెయ్యి రూపాయిల నోట్ల మాత్రమే వెనక్కి రాలేదు. ఇక తిరిగొచ్చిన పెద్ద నోట్లలో 7 లక్షల 62 వేల నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 5 వందలు, వెయ్యినోట్లు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే రద్దు నాటికి చలామణిలో ఉన్న నకిలీ మనీ 50 నుంచి 70 కోట్ల రూపాయలకు మించదు.

కేంద్ర ప్రభుత్వం మాత్రం వ్యవస్థలో భారీగా నకిలీ నోట్లు ఉన్నాయన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దుతో దాదాపు 9 వేల కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకుల్లోకి రాకుండా నిలిచిపోయాయి. 2016-17లో కొత్త కరెన్సీ ప్రింటింగ్‌ కు సెంట్రల్‌ బ్యాంకు ఏకంగా 7 వేల 965 కోట్లు ఖర్చు చేసింది. ఇది దాదాపు తిరిగిరాని నగదుతో సమానం. ఐతే, నోట్ల రద్దు తర్వాత 20 శాతం నగదు లావాదేవీలు తగ్గినట్లు ఆర్బీఐ తెలిపింది.

అటు ఈ ఏడాది దేశ వ్యాప్తంగా నాణేలకు ఏర్పడిన డిమాండ్‌ లో స్థిరమైన పెరుగుదల కనిపించినట్టు ఆర్బీఐ ప్రకటించింది. నాణేల మొత్తం విలువ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సర్క్యులేషన్‌ లో 14.7 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

పెద్ద నోట్ల రద్దుతో మొత్తం నల్లధనం రద్దవుతుందని, వ్యవస్థ మొత్తం ప్రక్షాళన అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడి చెప్పారు. దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం వెన్ను విరిగిపోతుందని అన్నారు. నల్లధనం ఆరు శాతం ఉండొచ్చన్న ప్రతిపక్షాల అంచనాలు కూడా గల్లంతయ్యాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం కనిపించలేదు.