హైదరాబాద్ లో మళ్లీ కుండపోత!

హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురిసింది. నిన్నటి (శుక్రవారం) కుండపోత వర్షం నుంచి తేరుకోకముందే సాయంత్రం భారీ వర్షం పడింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎస్‌.ఆర్‌.నగర్‌ లో కుండపోతగా వాన పడింది. ఖైరతాబాద్, లక్డీకాపూల్‌, అబిడ్స్‌, నాంపల్లి, కోఠిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బేగంబజార్‌, మంగళ్ హాట్‌, మెహదీపట్నం, కూకట్‌ పల్లి, దిల్‌ సుఖ్‌ నగర్‌, సరూర్‌నగర్‌, కర్మాన్‌ ఘాట్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్ నగర్‌, అంబర్‌ పేటలో భారీ వర్షం కురవగా.. చంచల్‌గూడ, సైదాబాద్‌, సంతోష్‌ నగర్‌, కాంచన్‌ బాగ్ ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడింది.  చంపాపేట్‌, బాలాపూర్‌, చత్రినాక, లాల్‌ దర్వాజా ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురవగా .. కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, ఐడీపీఎల్‌, చింతల్‌, సూరారం, కొంపల్లిలో చిరుజల్లులు పడ్డాయి. సాయంత్రం వేళ కావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.

వర్షాలతో ఎదురైన ఇబ్బందులను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు, మాన్సూన్ టీమ్స్, సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలు, రోడ్డు మరమ్మతు బృందాలు, ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక లేబర్ బృందాలు సహాయక చర్యలు ముమ్మురంగా కొనసాగిస్తున్నాయి. రోడ్డుపై నిలిచిన వరదనీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడంతో పాటు.. మ్యాన్ హోల్ మూతలు తెరిచి నీరు వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు.

శుక్రవారం నాటి కుండపోత వానకు జలదిగ్భంధంలో చిక్కుకున్న కాలనీలు, బస్తీలు తేరుకుంటున్నాయి. జీహెచ్‌ఎంసీ యంత్రాంగం ముమ్మరంగా వాటర్ రిమూవింగ్‌ పనులు చేపట్టడంతో రోడ్డుపై నిలిచిన వరదనీరు క్లియరైంది. నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను పొక్లెయిన్ల సహాయంతో తొలగించారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అపార్టుమెంట్ల సెల్లార్లలోకి చేరిన వరదనీటిని మోటార్లతో తొలగించారు.

అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనంతో ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో యావత్ జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అలర్ట్ గా ఉంది. ఎలాంటి పరిస్ధితునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఎమర్జెన్సీ బృందాలు, మాన్సూన్ టీమ్స్ సహాయక చర్యలు ముమ్మురంగా సాగిస్తున్నాయి.