పారితోషికంలో హీరోల కంటే ఎక్కువే!

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా సినీ ఏ పరిశ్రమలో ఏ హీరో హీరోయిన్లు ఎంతెంత పారితోషికాలు తీసుకున్నారనే విషయమై రకరకాల వార్తలు వినపడుతూ ఉంటాయి. ఇందుకు సంబంధించిన సమాచారం సినీ వర్గాల ద్వారా మీడియాకు చేరుతుంటుంది. ఇదే కోవలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే తాజాగా నటిస్తున్న ‘పద్మావతి’ చిత్రానికి ఎంత పారితోషికం తీసుకున్నదనే విషయమై వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న‘పద్మావతి’ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న దీపికా పదుకొణే రూ.13 కోట్లు పారితోషికంగా తీసుకుందట. దీపికకు జంటగా నటించిన షాహిద్ కపూర్, రణ్ బీర్ సింగ్ లకు మాత్రం ఒక్కొక్కరికి రూ.10 కోట్లు మాత్రమే ముట్టాయని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో దీపిక పాత్ర ప్రధానమైంది కాబట్టే ఎక్కువ పారితోషికం ఇవ్వాలని భన్సాలీ అనుకున్నట్టు సమాచారం. కాగా, హీరోలకు ఎక్కువ పారితోషికం, హీరోయిన్లకు తక్కువ పారితోషికం ఇస్తున్నారనేది కొంతకాలంగా చర్చనీయాంశమైన అంశమే. ఈ విషయమై భిన్నాభిప్రాయాలను బాలీవుడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు.