హర్యానా, పంజాబ్ లలో భారీ భద్రత

రేప్ కేసులో డేరాబాబా గుర్మీత్ సింగ్ కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలుశిక్ష  విధించటంతో హర్యానా, పంజాబ్‌ ప్రభుత్వాలు అలర్టయ్యాయి. గుర్మీత్ ను రేప్‌ కేసులో దోషిగా తేల్చిన రోజే భారీ ఎత్తున హింస చేలరేగటంతో ఈసారి మళ్లీ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాయి. రోహ్‌ తక్‌ సహా పంచకుల, సిర్సా పట్టణాల్లో 144 సెక్షన్ విధించాయి. ఈ మూడు ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పట్టణాల్లో పారా మిలిటరీ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి.

మరోవైపు, డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయం ఉన్న సిర్సాలో భారీ ఎత్తున బలగాలను మొహరించారు. అయినప్పటికీ గుర్మీత్ కు శిక్ష ఖరారైన వెంటనే సిర్సా తాలుకాలోని పూల్కా గ్రామంలో గుర్మీత్ అనుచరులు రెండు కార్లను తగులబెట్టారు. మరిన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు రెండు రాష్ట్రాల పోలీసులు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. హర్యానా, పంజాబ్‌ సీఎంలు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు  భద్రతపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అటు కేంద్రం సైతం రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో టచ్‌ లో ఉంది.