హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో హింస, 11 మంది మృతి

రేప్ కేసులో డేరాబాబా గుర్మీత్ సింగ్ ను సీబీఐ స్పెషల్ కోర్టు దోషిగా తేల్చటంతో ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో భారీ ఎత్తున హింసకు తెగబడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి లాఠీఛార్జ్‌  చేశారు. రెండు రాష్ట్రాల్లో తలెత్తిన హింస వల్ల 11 మంది చనిపోయినట్టు సమాచారం అందుతోంది. 200 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది.

పంచకుల పట్టణంలో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే గుర్మీత్‌ అనుచరులు రెచ్చిపోయారు. మీడియాతో పాటు ప్రైవేట్ వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. ఈ దాడుల్లో కొంతమంది జర్నలిస్టులకు గాయాలయ్యాయి. ఈ ఒక్కచోటే దాదాపు వంద వాహనాలను తగులబెట్టారు. పంచకుల సహా సిర్సాలో తీవ్రఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాల్లో దాదాపు 126 చోట్ల దాడులకు పాల్పడ్డారు. పంజాబ్‌ లోని మలౌత్‌ లో రైల్వే స్టేషన్‌, పెట్రోల్‌ బంక్‌ లను దహనం చేశారు. బర్నాలాలో ఓ టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ ను తగులబెట్టారు. ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్, ప్రభుత్వ ఆఫీసులపై దాడులు చేసి నిప్పంటించారు.

పంజాబ్‌ లోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. పరిస్థితి చేయి దాటే పరిస్థితి రావటంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్రం రంగంలోకి దిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. శాంతిభద్రతల పరిస్థితులను హర్యానా, పంజాబ్‌ సీఎం లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అటు కేంద్రం సైతం లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో రెండు రాష్ట్రాల సీఎం లతో టచ్‌ లో ఉంది.