శ్రీలంకతో ఇవాళ నాలుగో వన్డే

శ్రీలంక పర్యటనలో జోరుమీదున్న భారత జట్టు మరో సమరానికి సిద్ధమైంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా.. ఇవాళ నాలుగో మ్యాచ్‌లో ఆతిథ్య లంక జట్టుతో తలపడనుంది. ఇప్పటికే సిరీస్‌ను దక్కించుకున్న కోహ్లీ సేన రిజర్వ్‌ బెంచ్‌ బలాన్ని పరీక్షించనుంది. కాగా.. ఈ మ్యాచ్‌తో మాజీ కెప్టెన్‌ ధోనీ 300 వన్డేల క్లబ్‌లో చేరనున్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన ధోనీ భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా రికార్డుల కెక్కనున్నాడు. అటు ఇప్పటికే సిరీస్‌ కోల్పోయి ఒత్తిడిలో పడ్డా శ్రీలంకకు వరల్డ్ కప్‌ బెర్త్‌ రూపంలో మరో సవాల్‌ ఎదురుకానుంది. 2019 ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించాలంటే ఎనిమిదో స్థానంలో ఉన్న లంక ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు తప్పక గెలవాలి. లంక స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌ కపుగెదర గైర్హాజరీతో.. మలింగ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.