వుమెన్ క్రికెట్ టీంకు మరిన్ని టూర్లు

మహిళల క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నది. భవిష్యత్తులో మహిళల క్రికెట్ జట్టుకు మరిన్ని పర్యటనలు రూపొందించేందుకు బోర్డు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అటు ఇప్పటి దాకా ఆల్ ఇండియా జూనియర్ టోర్నీల్లో అండర్-19, అండర్-23 చోటు ఉండగా, దీన్ని అండర్-16కు విస్తరించే యోచనలో ఉన్నది. ఈ క్రమంలో క్రికెట్ పరిపాలన కమిటీ(సీవోఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల కమిటీ బుధవారం సమావేశం అయ్యే అవకాశముంది. ఇందులో భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్‌తో పాటు వెటరన్ బౌలర్ జులన్ గోస్వామి, బీసీసీఐ క్రీడాభివృద్ధి జీఎమ్ రత్నాకర్‌శెట్టి పాల్గొననున్నారు.   మరోవైపు భారత క్రికెట్ జట్టు షెడ్యూల్ విషయం సమావేశంలో చర్చకు వచ్చే చాన్స్ ఉన్నది.