విద్యాశాఖలో కొలువుల జాతర, వేతనాల పెంపు

విద్యాశాఖలో కొలువుల జాతరకు తెరలేచింది. ఈ శాఖకు ప్రభుత్వం కొత్త పోస్టులను మంజూరు చేసింది. 2008 తర్వాత ప్రారంభించిన 81 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,133 పోస్టులను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. దీంతో 2008 నుంచి మంజూరు కాని పోస్టుల్లో కాంట్రాక్టు పద్ధతిపై నడుస్తున్న ఈ విధానానికి మోక్షం లభించింది.

2008 తర్వాత ఈ 81 జూనియర్ కాలేజీలకు పలు దఫాలుగా మంజూరు ఇచ్చినా… అక్కడ కావాల్సిన బోధన, బోధనేతర పోస్టులను మాత్రం మంజూరు చేయలేదు. దీంతో, కాంట్రాక్టు విధానంలో బోధన, బోధనేతర సిబ్బందితోనే ఈ 81 కాలేజీలు నడుస్తున్నాయి. కాంట్రాక్టు పద్ధతిలో కాలేజీలను నడపడం వల్ల నాణ్యమైన విద్య అందించలేకపోతున్నామని, రెగ్యులర్ పోస్టులను మంజూరు చేయాలన్న వినతిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.

సెల్ఫ్ ఫైనాన్స్ భారం నుంచి ఉర్దూ మీడియం సెక్షన్లకు ప్రభుత్వం విముక్తి కల్పించింది. 15 ఉర్దూ మీడియం ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్స్ కింద నడుస్తున్న 21 సెక్షన్లకు సంబంధించి 69 జూనియర్ లెక్చరర్ల పోస్టులను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారు. నిజానికి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల విద్యార్థులపై ఆర్ధిక భారం పడుతోంది. దీనిని గమనించిన ప్రభుత్వం ఈ 15 కాలేజీలకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తానే నడిపే విధంగా అవసరమైన 69 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. దీంతో విద్యార్థులకు ఆర్ధిక భారం లేకుండా, ప్రభుత్వం ఏటా 1 కోటి 86 లక్షల 30 వేల రూపాయలు భరించనుంది. కాంట్రాక్టు పద్ధతిలో నియమించే  ఒక్కో ఉర్దూ మీడియం జూనియర్ లెక్చరర్ కు ఇక నుంచి 27 వేల రూపాయల గౌరవ వేతనం అందనుంది.

ఒకవైపు అవసరమైన కొత్త పోస్టులను మంజూరు చేస్తూనే.. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్న పార్ట్ టైం ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వేతనాలు పెంచారు. 63 మంది పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల వేతనాలు డబుల్ చేశారు. ప్రస్తుతం ఈ పార్ట్ టైం జూనియర్ లెక్చరర్లకు ఒక్కో పీరియడ్ కు 150 రూపాయలు చెల్లిస్తుండగా… ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఈ మొత్తం 300 రూపాయలకు పెరిగింది. ఒక్కో పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ కు నెలకు 72 పీరియడ్ ల చొప్పున గతంలో 10 వేల 800 రూపాయల వేతనం ఇచ్చేవారు. తాజా నిర్ణయంతో వారి వేతనం నెలకు 21 వేల 600 లకు పెరిగింది. అదేవిధంగా 52 మంది పార్ట్ టైం ల్యాబ్ అటెండర్ల వేతనాన్ని 3 వేల 900 రూపాయల నుంచి 7 వేల 800కు పెంచారు. దీనివల్ల ప్రభుత్వంపై 88 లక్షల 32 వేల రూపాయల అదనపు భారం పడనుంది.

సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు గౌరవ వేతనాలు పెరిగాయి. గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న ఎస్.ఎస్.ఎ, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల బోధన, బోధనేతర ఉద్యోగుల గౌరవ వేతనాల పెంపునకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. సర్వశిక్ష అభియాన్, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 11,839 మందికి గౌరవ వేతనాలు పెంచారు. ఇందులో సర్వశిక్ష అభియాన్ కు చెందిన 2,690 మంది పార్ట్ టైం ఇన్ స్ట్రక్టర్ల గౌరవ వేతనాన్ని 6 వేల నుంచి 9 వేలకు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ కు 11 వేల 400 నుంచి 15 వేలకు, ఎం.ఐ.ఎస్ కో -ఆర్డినేటర్లకు 13 వేల నుంచి 15 వేల రూపాయలకు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు 12 వేల నుంచి 14 వేలకు, మెస్సెంజర్లకు 8 వేల నుంచి 8వేల 500కు, సిస్టమ్ అనలిస్టులకు 15 వేల నుంచి 16 వేల రూపాయలకు పెంచారు. ఇక సీనియర్ ప్రోగ్రామ్ టెక్నికల్ కన్సల్టెంట్ కు 35 వేల నుంచి 40 వేల రూపాయలకు, కన్సల్టెంట్లకు 25 వేల నుంచి 35 వేలకు, డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్లకు 16 వేల 500 నుంచి 17 వేల 500 రూపాయలకు, డ్రైవర్లకు 13 వేల నుంచి 15 వేలకు, అటెండర్లకు 10 వేల నుంచి 12 వేలకు వేతనాలు పెంచారు.

కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 391 మంది స్పెషల్ ఆఫీసర్ల గౌరవ వేతనాన్ని 21 వేల నుంచి 25 వేలకు పెంచారు సీఎం కేసీఆర్. 2,737 మంది సీఆర్టీలకు 15 వేల నుంచి 20 వేలకు, 391 మంది అకౌంటెంట్లకు 10 వేల నుంచి 11 వేలకు, 391 మంది ఎ.ఎన్.ఎంలకు 9 వేల నుంచి 11 వేలకు, 391 పీఈటీలకు 11 వేల నుంచి 12 వేలకు, 782 మంది ఒకేషనల్ ఇన్ స్ట్రక్టర్లకు 5 వేల నుంచి 6 వేల రూపాయలకు వేతనాలు పెంచారు.