వరదల్లో చిక్కుకున్న భారత విద్యార్థులు

రెండు వందల మంది భారత విద్యార్థులు అమెరికాలోని హోస్టన్ వరదల్లో చిక్కుకున్నారని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్  ట్విట్టర్‌లో తెలిపారు. హోస్టన్‌లోని భారత కాన్సుల్ జనరల్ అనుపమరాయ్‌తో తాను మాట్లాడానని చెప్పారు. హోస్టన్ యూనివర్సిటీ పరిసరాల్లో మోకాలు లోతులో నీరు నిలిచి ఉందని, భారత్ నుంచి ఆహారం, ఇతర సామగ్రిని పంపించేందుకు ప్రయత్నించినా యూఎస్ కోస్ట్‌గార్డులు అనుమతించడంలేదని సుష్మ తెలిపారు. సహాయ, పునరావాస చర్యల నిమిత్తం నాలుగు వేల దళాలను టెక్సాస్ గవర్నర్ జార్జ్ అబాట్ పంపించారని ఆమె తెలిపారు. ఇద్దరు భారత విద్యార్థులు షాలిని, నిఖిల్ భాటియాలను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారని, వారి బంధువులను వీలైనంత తొందరగా అక్కడికి పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని సుష్మ చెప్పారు.