మూడు నెలల్లో భూ రికార్డుల ప్రక్షాళన

రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న సమగ్ర భూ సర్వేపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. భూ రికార్డులు ప్రక్షాళన చేసి… భవిష్యత్‌  లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసేందుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే అన్ని జిల్లాల కలెక్టర్లతో  ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. భూ రికార్డుల ప్రక్షాళన, సరళీకరణ, నవీకరణపై వారికి పలు సూచనలు చేశారు. హైదరాబాద్  ప్రగతిభవన్‌  లో జరిగిన ఈ మీటింగ్‌ లో డిప్యూటీ సీఎం మహమూద్‌  అలీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌  రెడ్డి, మిషన్‌  భగీరథ వైస్‌  చైర్మన్‌  వేముల ప్రశాంత్‌  రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉండే రెవెన్యూ అధికారులు… తమ ప్రాథమిక విధి అయిన భూముల నిర్వహణను నిర్లక్ష్యం చేయాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్‌  అభిప్రాయపడ్డారు. భూ రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల… అనేక వివాదాలు, గందరగోళం, ఘర్షణలకు దారి తీసిందని చెప్పారు. అందువల్లే రాష్ట్ర వ్యాప్తంగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించామన్నారు. వచ్చే మూడు నెలల పాటు కలెక్టర్లు, జాయింట్‌  కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు ఈ అంశానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సీఎం కేసీఆర్‌  ఆదేశించారు.

ఎకరాకు రెండు పంటల పెట్టుబడికిగానూ… ఏడాదికి 8 వేల రూపాయలు రైతుల బ్యాంకు అకౌంట్‌ లో వేయాలని నిర్ణయించామన్నారు సీఎం కేసీఆర్‌. అయితే భూములున్న రైతులెవరు? అని లెక్కలు తీస్తే… రెవెన్యూ రికార్డుల్లో ఒకలా, వ్యవసాయ శాఖ రికార్డుల్లో మరొకలా ఉందని చెప్పారు. భూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నారు. అందువల్ల… ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో తేల్చాలని, భూమి హక్కులపై స్పష్టత ఇవ్వాలని సూచించారు.

వివిధ పనుల కోసం రైతుల నుంచి లక్షలాది ఎకరాలు సేకరించామని సీఎం కేసీఆర్‌ అన్నారు. రైల్వే లైన్లు, ప్రాజెక్టులు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, హాస్పిటళ్లు, కాలువలు నిర్మించేందుకు… వ్యవసాయ భూములు సేకరించినట్టు చెప్పారు. కానీ వాటి వివరాలు నమోదు కాలేదని… ఆ భూములన్నీ ఇంకా రైతుల ఆధీనంలో ఉన్నట్టే రికార్డుల్లో ఉందని తెలిపారు. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ భూముల విషయంలో స్పష్టత రావాలని సీఎం కేసీఆర్‌  ఆదేశించారు.

మొదటి దశలో… రాష్ట్ర వ్యాప్తంగా వివాదం లేని భూముల విషయంలో క్లారిటీ రావాలన్నారు. ప్రతీ గ్రామంలో 80 నుంచి 95 శాతం వరకు వివాదాలు లేని భూములే ఉన్నాయని చెప్పారు. రైతులు, గ్రామస్తుల సహకారంతో వాటిపై స్పష్టత ఇవ్వాలని సూచించారు. ఇక రెండో దశలో… కోర్టు వివాదాల్లో ఉన్న భూములను గుర్తించాలని చెప్పారు. కోర్టు తీర్పుకు లోబడి వాటిపై స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూములు, ఫారెస్ట్, అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌ తదితర భూముల వివరాలు కూడా నమోదు చేయాలని సీఎం కేసీఆర్‌  ఆదేశించారు.

గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించే బృందాలను ఎంపిక చేసే బాధ్యత పూర్తిగా కలెక్టర్లదేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. అవసరమైతే కొంతమందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలని సూచించారు. రికార్డుల ప్రక్షాళన కోసం ప్రతీ కలెక్టర్‌ దగ్గర 50 లక్షల రూపాయలు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. రెవెన్యూ గ్రామం యూనిట్‌ గా వ్యవసాయ, ప్రభుత్వ భూములు, సర్కారు సేకరించిన అగ్రికల్చర్‌ ల్యాండ్స్‌ వివరాలను సేకరించాలని సూచించారు. అన్ని రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.

సాగునీరు, పెట్టుబడి, గిట్టుబాటు ధర… ఈ మూడు అంశాల్లో రైతులకు చేయూత అందితే వ్యవసాయం బాగుపడుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అందుకే వాటిపై దృష్టి పెట్టామని తెలిపారు. సాగు నీరందించేందుకు కృషి చేస్తున్నామని… ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. కోర్టు కేసుల ద్వారా వాటిని కొంతమంది అడ్డుకోవాలని చూస్తున్నారని… అయినా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకుపోతోందని తెలిపారు.

మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయానికి 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తుండటం వల్ల భూ గర్భ జలాలు కూడా వినియోగంలోకి వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం 45 శాతం పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నామన్నారు. వచ్చే రబీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉపరితల, భూగర్భ జలాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తున్నామని చెప్పారు.

వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎకరానికి 8 వేల చొప్పున పెట్టుబడి అందిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్‌. గిట్టుబాటు ధర కోసం రైతు సంఘాలు, రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అన్నదాతలు తీవ్ర బాధలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా సహా పలు దేశాల్లో టమాటా లాంటి ఉత్పత్తులను రోడ్లపై పారబోసే దృశ్యాలను చూస్తున్నామని… రైతులు సంఘటితంగా లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పారు. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో… రైతులను సంఘటితం చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర వర్గాల ప్రతినిధులుంటారని చెప్పారు. మూడో వంతు మహిళా సభ్యులుంటారన్నారు.

మండల రైతు సమస్వయ సమితి ప్రతినిధులు ఎప్పటికప్పుడు మార్కెట్లలోని అడ్తిదారులతో మాట్లాడి… గిట్టుబాటు ధర నిర్ణయిస్తారని సీఎం చెప్పారు. ఆ తర్వాతే రైతులు గ్రామాల వారీగా సరుకును తీసుకొచ్చి గిట్టుబాటు ధరను పొందుతారని వివరించారు. ఒకవేళ మార్కెట్లో సరైన మద్దతు ధర రాకుంటే… రాష్ట్ర రైతు సమన్వయ సమితి నేరుగా కొనుగోళ్లు చేపడుతుందని తెలిపారు. దీనికోసం ప్రభుత్వం 500 కోట్ల నిధిని సమకూర్చడంతో పాటు… ఐదారు వేల కోట్ల రుణం తీసుకునేందుకు గ్యారంటీ ఇస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితులకు… పంటను కొనుగోలు చేసి, ప్రాసెసింగ్‌  చేసే హక్కులను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అటు, భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించి పలు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన కార్యక్రమాన్ని పలువురు కలెక్టర్లు, అధికారులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివరాల ఆధారంగా… గ్రామాల్లో 95 శాతం భూమి వివాద రహితంగా ఉందని గుర్తించారు.