రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపారు. ఇప్పటికే ఇద్దరు వ్యాపారులపై పీడీ కేసులు, మరికొందరిపై 6ఏ, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కమిషనర్ సిఫారసు మేరకు బియ్యాన్ని పక్కదారి పట్టించిన నల్లగొండ జిల్లా దేవరకొండ హనుమాన్‌నగర్‌కు చెందిన చంద్రశేఖర్ (50)పై కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ గురువారం పీడీ కేసు నమోదుచేశారు. బియ్యం అక్రమ రవాణాలో ఆరితేరిన చంద్రశేఖర్‌పై 2014లో తొలి కేసు నమోదైంది.

ఇప్పటివరకు 6ఏ కేసులు 16, క్రిమినల్ కేసులు 5, మూడు బైండోవర్ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతుండటంతో పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ విభాగం చంద్రశేఖర్ కదలికలపై నిఘాపెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ 6న చంద్రశేఖర్ బొలెరో వాహనాన్ని తనిఖీచేసి 16.40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకోగా దేవరకొండ తహసీల్దార్ 6ఏ కేసు నమోదుచేశారు. మే 21న చంద్రశేఖర్ ఇంటిపై దాడిచేసి 4.5 క్వింటాళ్లు, కల్వకుర్తి రోడ్డులో ఉన్న మహాలక్ష్మీ గార్డెన్‌పై దాడిచేసి 18 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకుని, రెండు 6ఏ కేసులను నమోదు చేశారు. జూన్ 9న మరోసారి చంద్రశేఖర్ ఇల్లు, గార్డెన్‌పై దాడిచేసి 51.5 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు.

రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా రవాణాచేసే వ్యాపారులపై వేట కొనసాగిస్తామని పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టంచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సూర్యాపేటలో బియ్యం వ్యాపారి మిర్యాల నరసింహారావుపై, ఖమ్మం జిల్లా మల్లాయగూడెం వ్యాపారి సత్యనారాయణపైనా పీడీ కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. గురువారం చంద్రశేఖర్‌పైనా పీడీ కేసు నమోదైందని చెప్పారు. ఆర్నెళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 444 ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలను నిర్వహించి 6ఏ కేసులు 97, 25 క్రిమినల్ కేసులు నమోదు చేసి రూ.4.26 కోట్ల విలువ చేసే నిత్యావసర సరుకులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీంతో ప్రభుత్వానికి దాదాపు రూ.25 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు.