రేప్ కేసులో డేరా బాబా దోషి

డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్ రాం రహీం సింగ్ ను పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు రేప్‌ కేసులో దోషిగా తేల్చింది. 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో మొత్తానికి గుర్మీత్‌ నేరం చేసినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. ఐతే, శిక్షను మాత్రం ఈ నెల 28 న ఖరారు చేయనుంది. కోర్టు తీర్పు ప్రకటించిన వెంటనే గుర్మీత్ సింగ్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి, భద్రత కారణాల దృష్య్టా ఆయన్ను ప్రత్యేక హెలిక్యాప్టర్‌ లో రోహ్‌తక్ జైలుకు తరలించారు. జైలు చుట్టూ కిలోమీటర్‌ పరిధిలో సీఐఎస్ఎఫ్ బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

అంతకుముందు ఏకంగా 2 వందల వాహనాలు కాన్వాయ్‌ గా గుర్మీత్ సింగ్ తన ఆశ్రమం నుంచి కోర్టుకు బయలుదేరారు. ఐతే, కోర్టుకు కిలోమీటర్‌ దూరంలోనే ఈ కాన్వాయ్ ను పోలీసులు ఆపేశారు. కోర్టు ఆవరణలోకి కేవలం రెండు వాహనాలకు మాత్రమే అనుమతించారు. కోర్టు హాల్‌ లోకి ఇరు వర్గాల తరఫున కొంతమంది లాయర్లకే ప్రవేశం కల్పించారు. న్యాయమూర్తి ముందు గుర్మీత్ సింగ్ బాబా చేతులు కట్టుకొని నిలబడ్డారు. గుర్మీత్‌ సింగ్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నందున ఆయన దోషియేనని కోర్టు తెలిపింది.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు 15 ఏళ్ల క్రితమే నమోదైంది. 2002 లో సిర్సాలోని ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు గుర్మీత్‌ సింగ్‌ పై ఆరోపణలు వచ్చాయి. బాధితులు ఏకంగా అప్పటి ప్రధాని వాజ్‌ పేయ్‌ కి లేఖ రాయటంతో ఆయన చొరవ కారణంగా కేసు నమోదైంది. హర్యానా కోర్టు సైతం గుర్మీత్ సింగ్ పై కేసు నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది. దీంతో సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. దాదాపు 15 ఏళ్ల విచారణ అనంతరం గుర్మీత్ సింగ్‌ ను దోషిగా తేల్చారు.