రెడ్డీస్‌పై అమెరికా కోర్టులో కేసు

అమెరికా కోర్టులో సంస్థపై నష్టపరిహార దావా దాఖలైందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తెలిపింది. తప్పుదోవ పట్టించే స్టేట్‌మెంట్లతో అమెరికా ఫెడరల్ సెక్యూరిటీ చట్టాలను అతిక్రమించామని ఆరోపిస్తూ సంస్థకు చెందిన కొందరు ఇన్వెస్టర్లు న్యూజెర్సీ డిస్ట్రిక్ట్ కోర్టులో ఈనెల 25న క్లాస్ యాక్షన్ సూట్ దాఖలైందని బీఎస్‌ఈకి రెడ్డీస్ సమాచారం అందించింది. సరైన సమాచారం ఇవ్వని కారణంగా కంపెనీ షేర్ల ధర క్షీణత కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇన్వెస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ దావాకు సంబంధించి సంస్థ ఇంకా నోటీసులందుకోలేదని, కాబట్టి ఆరోపణలపై ఇప్పుడే స్పందించలేమని తెలిపింది. క్లాస్ యాక్షన్ సూట్ దాఖలైందన్న వార్త నేపథ్యంలో సోమవారం నాటి ట్రేడింగ్‌లో రెడ్డీస్ షేర్లు రెండు శాతం మేర క్షీణించాయి. బీఎస్‌ఈలో సంస్థ షేరు ధర 2.01 శాతం తగ్గి రూ.2,045.90 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 2.78 శాతం పతనమై రూ.2,029.70 వద్దకు పడిపోయినప్పటికీ చివర్లో కాస్త కోలుకుంది.