రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు

రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి..! అల్పపీడన ప్రభావంతో వరణుడు ప్రతాపం చూపిస్తున్నాడు..! వినాయక చవితి పండుగ వేళ తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి..! ముఖ్యంగా భాగ్యనగరం భారీ వర్షాలకు తడిసి ముద్దైంది..! నగరంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది..!  హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి.

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది..! శుక్రవారం సాయంత్రం మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా నగరాన్ని అతలాకుతలం చేసింది..! భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి..!  సికింద్రాబాద్‌ ప్రాంతంలో మోండా మార్కెట్‌, బేగంపేట, ప్యాట్నీ, రాంగోపాల్‌పేట, మారేడ్‌ప‌ల్లి, చిలకలగూడ, పార్సీగుట్ట, అడ్డగుట్ట, తుకారాంగేట్‌, తిరుమలగిరి, అల్వాల్‌, యాప్రాల్‌, బాలాజీనగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది..!  మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, శేరిలింగంపల్లి, మియాపూర్‌, చందానగర్‌, కూకట్‌పల్లి, వై జంక్షన్‌, ఎర్రగడ్డ, బోరబండ, అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మెహిదీపట్నం త‌దిత‌ర ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

అటు ఎల్బీనగర్‌, నాగోల్‌, ఉప్పల్‌, బోడుప్పల్‌, మేడిపల్లి, నాచారం, మల్లాపూర్‌, హబ్సిగూడ, తార్నాక, లాలాపేట, ఉస్మానియా క్యాంపస్‌, సరూర్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చంపాపేట్‌, సైదాబాద్‌ తదితర ప్రాంతాలను కుండపోత వర్షం ముంచెత్తింది. భారీ వర్షాలతో నగరంలోని రహదారులన్నీ జలమయమైనాయి..! ప్రధానంగా ఎర్రమంజిల్‌, లక్డీకాపూల్, నాంపల్లిలోని దారుస్సలాం జంక్షన్‌ల దగ్గర పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది..! అంబర్‌పేట్ పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి..! ఛే నెంబర్ జంక్షన్ లో పెద్ద ఎత్తున నీరు చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి..!  ఇక భారీవర్షం ధాటికి ఖైరతాబాద్‌ మహా గణపతి దర్శనం కోసం వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు..! నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది..! నగరంలోని నాలాలు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

హైదరాబాద్‌లో అత్యధికంగా మాదాపూర్‌లో 11.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది..! బాలానగర్ లో 11.6, బేగంపేట్‌, బండ్లగూడలో 10.3. సెంటీమీటర్ల వర్షం కురిసింది..!  మైత్రివనంలో 9.7, శ్రీనగర్ కాలనీ, రాంచంద్రాపురంలో 9.4,  అంబర్‌పేట్‌లో 9.1, కుత్బుల్లాపూర్, కాప్రాలో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది..! ఇక పాశమైలారంలో 7.9, మోండా మార్కెట్‌లో 7.7, మల్కాజిగిరిలో 7.5, ఎల్బీనగర్‌లో 7.1, ముషీరాబాద్ లో 6.9, నారాయణగూడలో 6.8, ఆసిఫ్ నగర్‌, నాంపల్లిలో 6.7, తిరుమల్‌ గిరిలో 6.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వెస్ట్ మారేడ్ పల్లిలో 5.6, మీరాలంలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా… జూబ్లీహిల్స్ ప్రాంతంలో 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

నగరంలో వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది..! దీంతో పలు ప్రాంతాలన్నీ అంధకారంలో మునిగిపోయాయి..! ఇక జంక్షన్లన్నీ జలాశయాలుగా మారిపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు ప్రజలను ఇబ్బంది పెట్టాయి..! దీంతో జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు రాత్రికి రాత్రే రంగంలోకి దిగాయి..! జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ జనార్ధన్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్  పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు..! లోతట్టు ప్రాంతాల్లో  యద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేయాలని అధికారులను ఆదేశించారు..!

హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లోనూ వర్షాలు కురిసాయి..! మేడ్జల్ జిల్లా కీసరలో భారీ వర్షం పడింది..! బాలానగర్‌, కుత్బుల్లాపూర్‌, చింతల్‌లోనూ ఎడతెరిపి కూడా వర్షం కురిసింది..! ఐడీపీఎల్‌, సుచిత్ర, సూరారం ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమైనాయి..! లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.

మహబూబ్‌ నగర్‌ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. నారాయణపేట, కోస్గి, మద్దూర్ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మహబూబ్‌ నగర్, హన్వాడ, జడ్చర్ల, బాలానగర్ ప్రాంతాల్లో వాన పడింది. వనపర్తి జిల్లాలోని కొత్తకోట, మదనపురం మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్ద కొత్తపల్లి, కోడేరు మండలాల్లో మోస్తరు వర్షం కురవగా… కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాలను భారీ వర్షం ముంచెత్తింది. అటు నాగర్ కర్నూల్, తాడూరు, తెల్కపల్లి, బిజినేపల్లి, తిమ్మాజీపేట మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది.

రంగారెడ్డి జిల్లాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, శంషాబాద్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. షాద్‌ నగర్, కేశంపేట మండలాల్లో పలు ప్రాంతాల్లోనూ ఎడతెరపి లేకుండా వర్షాలు కురిసాయి. మరోవైపు కొమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్, తిర్యాని, రెబ్బెన, కెరామెరి మండలాల్లో తేలికపాటి జల్లులు కురిసాయి. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్ చెరు, ఆందోల్ నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు కురిసాయి. మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లోనూ ఓ మోస్తరు వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.