రాష్ట్రపతి దగ్గర తమిళనాడు పంచాయితీ!

తమిళనాడు రాజకీయ పంచాయితీ రాష్ట్రపతి భవన్ కు చేరింది. పళనిస్వామి సర్కారును  బలపరీక్షకు ఆదేశించాలని డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ స్టాలిన్ రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ని కోరనున్నారు. ఈ మేరకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో ఆయన ఢిల్లీ చేరుకున్నారు.

తమిళనాడులో దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత మొదలైన సంక్షోభానికి ఇప్పటికీ ఫుల్‌ స్టాప్‌ పడటం లేదు. పన్నీర్‌, పళనిస్వామి వర్గాలు విలీనం కావటంతో సమస్య ముగిసినట్లేనని భావించినప్పటికీ… శశికళ వర్గానికి చెందిన దినకరన్‌ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. పళనిస్వామికి అవసరమైన మెజార్టీ లేదని, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలలో 40 మంది తనకు మద్దతిస్తున్నారని చెబుతున్నారు. 20 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని పలుమార్లు మీడియా ముందు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు ను కలిసి పళనిస్వామి ప్రభుత్వాన్ని బలనిరూపణకు ఆదేశించాలని కోరారు. ఐతే, గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు మాత్రం ఇందుకు నో చెప్పారు. సీఎం పళనిస్వామిపై ఎదురుతిరిగిన దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు ఇంకా అన్నాడీఎంకేలోనే కొనసాగుతున్నారని స్పష్టం చేశారు. ఈ కారణంగా రెబల్స్‌ డిమాండ్‌ మేరకు తాను నడుచుకోలేనని దినకరన్‌ వర్గానికి షాక్‌ ఇచ్చారు.

పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు దినకరన్ ప్రయత్నిస్తున్నందున ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని డీఎంకే నేత స్టాలిన్ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ నేతలు గవర్నర్ ను కలిసి పళనిస్వామి ప్రభుత్వాన్ని బలనిరూపణకు ఆదేశించాలని కోరారు. గవర్నర్ తాజాగా ఇందుకు నో చెప్పటంతో స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ పై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ పంచాయితీని రాష్ట్రపతి వద్దే తేల్చుకోవాలని ఢిల్లీ చేరుకున్న స్టాలిన్ తమిళనాడులో రాజకీయ పరిస్థితిని ఆయనకు వివరించనున్నారు. బల పరీక్షకు ఆదేశాలు జారీ చేయాలని కోరనున్నారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించకుంటే న్యాయపరంగా ముందుకెళ్తామని స్టాలిన్ చెప్పారు. ఇదే అంశంపై దినకరన్ సైతం రాష్ట్రపతిని కలుస్తామని చెబుతున్నారు.