రాష్ట్రంలో రోడ్ల సమగ్రాభివృద్ధికి ట్రాక్

తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ట్రాక్) ద్వారా రాష్ట్రంలోని అన్ని రోడ్లతో పాటు పొరుగు రాష్ట్రాలకు ఉత్తమమైన రోడ్ కనెక్టివిటీని ఏర్పాటు చేసేందుకు ఆర్ అండ్ బి శాఖ ప్రణాళిక రూపొందించింది. దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన హైదరాబాద్ లోని ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది.

కొత్తగా ఏర్పడిన 31 జిల్లాల అభివృద్ధిలో భాగంగా ఆయా జిల్లాల ముఖ్య పట్టణాలకు కనెక్టివిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో లీ అసోసియేట్స్  కన్సల్టెన్సీ ద్వారా అధ్యయనం చేయించింది. రాష్ట్రంలో 31 జిల్లాలను ఒక కలిపే బృహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ట్రాక్) అనే ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం ద్వారా చేపట్టేందుకు ఒక ప్రతిపాదన తెచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ముఖ్య పట్టణాలను కలిపే విధంగా ఈ ప్రణాళిక రచించారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ నగర 1) ఔటర్ రింగ్ రోడ్, 2) రీజినల్ రింగ్ రోడ్లకు అదనంగా మరో రెండు రింగ్ రోడ్లు, 3) తెలంగాణ బంగారు వలయం, 4) బంగారుమాల కారిడార్, 5) ఉత్తర-దక్షిణ కారిడార్, 6) తూర్పు-పడమర కారిడార్, 7) మరిన్ని తెలంగాణ ప్రగతి పథాలు (రేడియల్ రోడ్స్)తో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అనుసంధానించేలా బంగారు తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం రూపొందించారు.

ఈ పథకంలో సుమారు 5,107 కిలోమీటర్ల రింగ్ రోడ్లు, కారిడార్లు, రేడియల్ రోడ్లు అభివృద్ధికి ప్రతిపాదించబడ్డాయి. వీటిలో జాతీయ రహదారుల నిడివి 905 కిలోమీటర్లు  కాగా, ప్రణాళికలో అంతర్గతంగా కలిసిపోయే (ఓవర్ లాప్) నిడివి 239 కిలోమీటర్లు. నికరంగా ట్రాక్ పథకంలో రాష్ట్రం అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన నిడివి 3,963 కిలోమీటర్లు. ఈ పథకం ద్వారా 31 జిల్లాలకు కనెక్టివిటీ ఏర్పాటుకు ప్రణాళికలను మంత్రి తుమ్మల పరిశీలించారు.

ట్రాక్ పథకం ద్వారా 30 జిల్లాలలో 425 మండలాలకు రహదారి సౌకర్యం ఏర్పడుతుంది. ఈ రహదారులు 164 పారిశ్రామిక మండళ్ళకు కనెక్టివిటీని కలిగిస్తాయని మంత్రి తుమ్మల తెలిపారు. 87 పర్యాటక ప్రదేశాలను, 91 వ్యవసాయ మార్కెట్లను కలిపేవిధంగా ప్రణాళిక ఉంటుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన రాజధానిని జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాలను మండల కేంద్రాలకు, మండల కేంద్రాలను ఇతర ముఖ్య పట్టణాలతో అనుసంధానించే కార్యక్రమం విజయవంతంగా అమలు జరుగుతోంది. ఆ పథకంలో భాగంగా 14,550 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధిని రాష్ట్ర రహదారులు మరియు భవనముల శాఖ చేపట్టింది. మొత్తం రాష్ట్ర రహదారుల నిడివి 25,792 కిలోమీటర్లని, తమ శాఖకు ఇతర శాఖల నుండి బదిలీ అయిన తరువాత ప్రతిపాదిత రహదారుల నిడివి 42,053 కిలోమీటర్లు ఉండాలని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

బంగారు తెలంగాణ సాధనకు రహదారుల అభివృద్ధి పాత్రను గుర్తించిన ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల మరియు ఇతర దేశాల రహదారుల అభివృద్ధి తీరును పరిశీలించి ఒక విజన్ డాక్యుమెంటుని లీ అసోసియేట్స్ ద్వారా తయారు చేయించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ విజన్ డాక్యుమెంటులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు రహదారి అనుసంధానం మాత్రమే కాకుండా ఐదు పొరుగు రాష్ట్రాలతో చక్కటి అనుసంధానం ఏర్పడే విధంగా ట్రాక్ ప్రణాళికలు ఉంటాయని తెలిపారు. ట్రాక్ పథకంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడి, ఆర్ధిక-సామాజిక అభివృద్ధి, బంగారు తెలంగాణ సాధనకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు.

ఇతర దేశాలలో రహదారుల అభివృద్ధి ఆయా దేశాల ఆర్ధిక అభివృద్ధికి దోహద పడిన దాఖలాలు ఉన్నాయని మంత్రి తుమ్మల అన్నారు. ఆయా దేశాల స్థితిగతులను, ఇతర రాష్ట్రాలలో ఉన్న రహదారుల నిర్మాణ వ్యవస్థలను మదింపు చేసి ట్రాక్ పధకాన్ని ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం గా ప్రతిపాదించినట్లు వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సంబంధిత అధికారులతో ఈ పథకాన్ని మరోమారు చర్చించి, దీనికి తుదిరూపు ఇస్తామని మంత్రి తుమ్మల చెప్పారు. వచ్చే డిసెంబరు మాసానికి ఈ కార్యక్రమం అమలు అయ్యేలా నిధులను సమకూర్చుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటే రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించిన  నిధులతో అసాధ్యమని, దీనికి ప్రత్యేక నిధులతో ఒక స్టేట్ రోడ్ ఫండ్ ఏర్పాటు పరిశీలనలో ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి సూచనలతో, ఆమోదంతో నిధుల సమీకరణ చేపడతామని చెప్పారు.

ఈ సమావేశంలో ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, రవీందర్ రావు, ఇఎన్సి, లీ కన్సల్టెంట్ సంస్థ ప్రతినిధులు, ఇతర రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.