ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం నుంచి 66 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైనట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. మరో 48 గంటల పాటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. అటు భారీ వర్షాలకు  పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో.. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రైళ్లు, విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. హింద్ మతా, దాదార్ ప్రాంతాల్లో వర్షానికి రోడ్లపై అడుగు లోతు నీరు నిలిచిపోయింది. అత్యవసర పని ఉంటే తప్పితే.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. మరోవైపు అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. వర్షాల కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి.