మల్కాజ్ గిరిలో 11 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు

మల్కాజ్‌ గిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. బేగంపేటలోని మెట్రోరైలు భవన్ లో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, రోడ్లు, వాటర్ వర్క్స్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళుతున్నాయి, మల్కాజ్‌ గిరి పరిధిలో ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ వివరించారు.

మల్కాజ్‌ గిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో సుమారు 11 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మురికి వాడల్లో తమ స్ధలాలను ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన వారికే ఇళ్లు ఇస్తామన్నారు. నగరంలోని చుట్టుపక్కల కడుతున్న చోట పక్కా ప్రణాళిక ద్వారా ఆయా ప్రాంతాల్లోని పేదలకే డబుల్ బెడ్ రూం ఇళ్లు అందిస్తామన్నారు. గతంలో మాదిరిగా నగరానికి సుదూరంగా కాకుండా క్యాచ్ మెంట్ ఏరియాలను ఏర్పాటు చేసుకుని సాధ్యమైనంత దగ్గరలో ఇళ్లు ఇస్తామన్నారు. ఇందుకోసం పకడ్బందీ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను కోరారు.

గతంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు ధరఖాస్తు చేసుకోని వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరారు. గతంలోనే లక్షలాది మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని, మిగిలిన వారికి దరఖాస్తు చేసుకునే అంశంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి కె.టి.రామారావు తెలిపారు.

మల్కాజ్‌ గిరి నియోజకవర్గ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్ రామ్మోహన్, మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.