మరింత ముదురుతున్న డొక్లాం వివాదం

భారత్‌-చైనా మధ్య డొక్లాం వివాదం మరింత ముదురుతోంది. భారత బలగాలు వెనక్కి వెళ్లాలని పలుమార్లు చైనా హెచ్చరించటాన్ని భారత్ సీరియస్‌ గా తీసుకుంది. పైగా ఈ ప్రాంతంలో చైనా బలగాలను మొహరించి పరిమిత సైనిక చర్యకు దిగుతామని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో చైనాకు ధీటుగా సమాధానం చెప్పేందుకు  భారత్ సైతం సిద్ధమైంది. సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లలోని చైనా సరిహద్దుకు భారీగా సైనిక బలగాలను పంపించింది. ఐతే ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు అధికారికంగా ప్రకటించలేదు.

అటు చైనా, ఇటు భారత్‌ బలగాలు సరిహద్దుల వద్ద మొహరించటంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న టెన్షన్‌ మొదలైంది. ఐతే చైనా దాడికి పాల్పడితేనే భారత్‌ ఎదురుదాడి చేయాలని భావిస్తోంది. ముందుగా ఎలాంటి కవ్వింపు చర్యలకు భారత్‌ సిద్ధంగా లేదని విదేశాంగ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ తాము దౌత్యపరమైన చర్చలతో ఈ సమస్యను పరిష్కారించుకోవాలని భావిస్తున్నట్లు భారత్‌ చెబుతోంది.

కాగా భారత్‌-చైనాల మధ్య డోక్లామ్‌ సరిహద్దు వివాదం విషయంలో భారత్‌ పూర్తి పరిణతితో వ్యవహరిస్తోందని అమెరికాకు చెందిన ప్రముఖ రక్షణరంగ నిపుణుడు జేమ్స్‌ ఆర్‌.హోమ్స్‌ అభిప్రాయపడ్డారు. చైనా  మాత్రం మొండివైఖరితో ఆ దేశ అనాలోచిత ప్రవర్తనను స్పష్టం చేస్తోందన్నారు. ఐతే ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే మాత్రం అమెరికా భారత్‌ కే మద్దతు తెలుపుతుందని ఆయన స్పష్టం చేశారు.